KKR vs MI: కోల్‌కతా ధనాధన్ బ్యాటింగ్.. ముంబై ఎదుట ధీటైన టార్గెట్

KKR vs MI: కోల్‌కతా ధనాధన్ బ్యాటింగ్.. ముంబై ఎదుట ధీటైన టార్గెట్

సొంతగడ్డపై కోల్‌కతా బ్యాటర్లు మరోసారి రెచ్చిపోయారు. 16 ఓవర్ల ఆట కావడంతో వచ్చిన వారు వచ్చినట్లుగా ఎదుర్కొన్న తొలి నుంచి బాదడం మొదలు పెట్టారు. అదే వారికి కలిసొచ్చింది. దీంతో కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్(22 బంతుల్లో 42), నితీష్ రాణా(23 బంతుల్లో 33), ఆండ్రీ రస్సెల్(14 బంతుల్లో 24) పరుగులు చేశారు. 

మొదట వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అంపైర్లు.. ఆటను 16 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌క‌తా ఆదిలోనే క‌ష్టాల్లో ప‌డింది. ముంబై పేస‌ర్ల విజృంభ‌ణ‌తో 10 ప‌రుగుల‌కే ఓపెన‌ర్ల వికెట్లు కోల్పోయింది. తొలి ఓవ‌ర్లోనే డేంజ‌ర‌స్ ఫిలిప్ సాల్ట్(6)ను తుషార వెన‌క్కి పంపగా.. సునీల్ న‌రైన్‌(0)ను బ‌మ్రా బౌల్డ్ చేశాడు. ఆ సమయంలో వెంక‌టేశ్ అయ్యర్(42), శ్రేయ‌స్ అయ్యర్(7)ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 30 పరుగులు జోడించారు. 

ఆది నుంచి తడబడుతూ ఆడిన శ్రేయాస్ అయ్యర్‌ను కంబోజ్ బౌల్డ్ చేశాడు. అతని స్థానంలో క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా(33) నిలకడగా ఆడాడు. మరో ఎండ్‌లో దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్‌ అయ్యర్‌(42)ను పీయూష్‌ చావ్లా వెనక్కి పంపాడు. అనంతరం రస్సెల్(24) కాసేపు మెరుపులు మెరిపించాడు. చివరలో రింకు సింగ్ (20), రమణ్‌దీప్‌ సింగ్ (17 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.

ముంబై బౌలర్లలోచావ్లా, బుమ్రా  రెండేసి వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కాంబోజ్, నువాన్ తుషార చెరో వికెట్ తీసుకున్నారు.