దారి దోపిడీ కేసులో నిందితులు అరెస్ట్

దారి దోపిడీ కేసులో నిందితులు అరెస్ట్

కరీంనగర్ క్రైం, వెలుగు:  కళ్లల్లో కారం చల్లి దోపిడీ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్  చేసి బంగారు గొలుసు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులంతా 19  ఏండ్ల వారు కాగా, మరో నిందితుడు మైనర్  కావడం గమనార్హం. శుక్రవారం కమిషనర్  కార్యాలయంలో సీపీ గౌష్  ఆలం మీడియాకు వివరాలు వెల్లడించారు.

గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ తమ్మనవేని కొమురయ్యను ఈ నెల 11న రాత్రి  నేదునూర్  నుంచి బైక్​పై వెళ్తున్నాడు. గ్రామ శివారులోని మామిడి తోట వద్ద అదే గ్రామానికి చెందిన పెనుగొండ అబినైజర్(19), పంబాల నాగరాజు(19), పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తి గ్రామానికి చెందిన గుజ్జేటి మధువర్ధన్(19), నుస్తులాపూర్  గ్రామానికి చెందిన మాచర్ల రాంచరణ్  గౌడ్(19)తో పాటు మరో మైనర్  అడ్డుకున్నారు.

కళ్లల్లో కారం చల్లి కొమరయ్య మెడలోని తులం బంగారు గొలుసు, రూ. వెయ్యి  నగదు దోచుకొని పరారయ్యారు. శుక్రవారం ఉదయం ఇందిరానగర్  క్రాస్  రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు పట్టుపడ్డారు. వారి నుంచి స్విఫ్ట్  డిజైర్  కారు, తులం బంగారు గొలుసు, రూ. వెయ్యి నగదు, 4 మొబైల్  ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కేసును ఛేదించిన కరీంనగర్  రూరల్  ఏసీపీ విజయ కుమార్, తిమ్మాపూర్  సీఐ సదన్  కుమార్, ఎల్ఎండీ కాలనీ ఎస్సై అన్వర్, కానిస్టేబుళ్లు రాఘవ, ఆకాశ్, అనిల్ కుమార్‌‌‌‌ను సీపీ  అభినందించారు.