కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించి రూ.కోట్లు కొల్లగొట్టిన మిల్లర్లపై జిల్లా సివిల్ సప్లై అధికారులు ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు. ఇల్లందకుంట మండలంలో ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించిన ఇద్దరు మిల్లర్లపై జిల్లా సివిల్ సప్లై మేనేజర్ రజనీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలో మిల్లర్ల అక్రమాలపై ‘వీ6వెలుగు’ పేపర్‌లో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. మిగతా జిల్లాల్లో కేసులు, అరెస్టులు జరుగుతుంటే కరీంనగర్ జిల్లాలో ఆఫీసర్లు మౌనంగా ఉండడంపై శుక్రవారం కథనం ప్రచురితమైంది.
ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామంలో సీఎంఆర్ బకాయి ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ యజమాని గూడూరు మాధవితో పాటు ఇల్లందకుంటలోని శ్రీ హనుమాన్ సీతారామాంజనేయ రైస్ మిల్ యజమాని కసుబోవుల నరసయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిల్లర్లపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇల్లందకుంట ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు.
