రాహుల్ పేరు పలికే అర్హత హరీశ్కు లేదు..ఇతర పార్టీల వారిని చేర్చుకొని ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేశారు: మేడిపల్లి సత్యం 

రాహుల్ పేరు పలికే అర్హత హరీశ్కు లేదు..ఇతర పార్టీల వారిని చేర్చుకొని ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేశారు: మేడిపల్లి సత్యం 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరు పలికే అర్హత బీఆర్ఎస్ నేత హరీశ్ రావుకు లేదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్ భవన్ సాక్షిగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరి, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడం, అసెంబ్లీ వేదికగా మీరు చేసిన విలీనాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదన్నారు.

టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రా రెడ్డిని మంత్రులను చేసి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన మీకు ఆ పదాలను ఉపయోగించే అర్హత ఎక్కడిదన్నారు. గతంలో చేసిందంతా చేసి, ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల డిస్మిస్, ఫిరాయింపులపై రాహుల్​గాంధీకి ఎలా లేఖ రాస్తారని ప్రశ్నించారు. 

గులాబీ కండువాలు కప్పినప్పుడు గుర్తురాలేదా? : విప్​ రామచంద్రునాయక్​

హరీశ్ రావు ప్రజాస్వామ్య విలువల గురించి రాహుల్ గాంధీకి లేఖ రాయడంపై ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి, వారిని ప్రలోభాలకు గురిచేసి, మీ మామ కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి, గులాబీ కండువాలు కప్పినప్పుడు ఫిరాయింపుల చట్టం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించినప్పుడు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ రక్షణ ఎటు పోయాయని ఫైర్​అయ్యారు.