హైదరాబాద్ లో భారీ వర్షం... సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు పోదామనే టైంలో..

హైదరాబాద్ లో భారీ వర్షం... సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు పోదామనే టైంలో..

హైదరాబాద్ లో భారీ వర్షం దంచికొట్టింది. శుక్రవారం ( ఆగస్టు 7 ) సాయంత్రం సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైంలో భారీ వర్షం కురిసింది. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. సిటీలోని అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడా, మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 

సాయంత్రం సమయంలో వర్షం కురవడంతో ఐటీ కారిడార్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లన్నీ జలమయమయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.ఐటీ ఉద్యోగుల కార్లు, బైక్స్, క్యాబ్లతో రోడ్లపై ఫుల్ ట్రాఫిక్ జామ్ నెలకొంది. కొన్ని చోట్ల నీళ్లు నిలిచిపోవడంతో GHMC, హైడ్రా రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. 

వర్షాలు కురిసిన ప్రతిసారీ సిటీ రోడ్లు గుంతలమయంగా మారి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధాన కూడళ్ల నుంచి అంతర్గత రోడ్ల వరకు ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తుండటంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది.

వర్షపు నీటితో గుంతలు కనిపించక వాహనాలు ఒక్కసారిగా అదుపు తప్పుతున్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలని నగరవాసులు కోరుతున్నారు.