హైదరాబాద్: కొత్తూరు మున్సిపాలిటీలోనీ ఇండియన్ ఆయిల్ గ్యాస్ ప్లాంట్ లో ఉగ్రవాదులు ఉన్నారనే ప్రచారం స్థానికంగా కలకలం రేపింది. ఆ ప్రాంతంలో కేంద్ర బలగాలు భారీగా మోహరించడంతో స్థానికులు కూడా నిజమేనని భావించారు. అసలు కొత్తూరు ప్రాంతానికి ఉగ్రవాదులు ఎలా వచ్చారో.. ఎక్కడ నుంచి వచ్చారోనని స్థానికంగా చర్చ జరిగింది. అయితే.. ఇది మాక్ డ్రిల్ అని.. ఉగ్రవాదులు అలా వస్తే భద్రతా బలగాలు ఎలా స్పందిస్తాయి, ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మాక్ డ్రిల్ చేసినట్లు భద్రతా బలగాలు తెలిపాయి.
ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమలలో కూడా అప్పుడప్పుడూ ఇలాంటి మాక్ డ్రిల్స్ జరుగుతుంటాయి. తిరుమల శ్రీవారి ఆలయం ముందు అక్టోపస్ మాక్ డ్రిల్ ఒక సందర్భంలో భక్తులను కలవరపాటుకు గురి చేసింది. ఉగ్రవాదుల ముప్పు ఉన్న ఆలయంపై దాడి జరిగితే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై మాక్ డ్రిల్ నిర్వహించిన ఆక్టోపస్ ఎన్ ఎస్ జి బలగాల హడావుడి భక్తులను అయోమయానికి గురిచేసింది.
2024లో శ్రీవారికి ఏకాంత సేవ పూర్తయ్యాక భద్రతా సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రవాదులు ఆలయంలోకి ప్రవేశిస్తే భక్తులను ఎలా రక్షించాలి, ఆలయ తలుపులు మూసివేస్తే ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై మాక్ డ్రిల్ చేసింది.
