ప్రైవేట్‌ స్లీపర్‌‌ బస్‌‌ బోల్తా.. నలుగురు మృతి.. మరో ఏడుగురికి గాయాలు

ప్రైవేట్‌ స్లీపర్‌‌ బస్‌‌ బోల్తా.. నలుగురు మృతి.. మరో ఏడుగురికి గాయాలు
  • హైదరాబాద్‌‌ నుంచి మహారాష్ట్రలోని అకోలా వెళ్తున్న స్లీపర్‌‌ బస్సు
  • నిజామాబాద్‌‌ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ప్రమాదం

నిజామాబాద్, వెలుగు: ప్రైవేట్‌‌ స్లీపర్‌‌ బస్‌‌ బోల్తా పడి నలుగురు చనిపోగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నిజామాబాద్‌‌ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం వద్ద నేషనల్‌‌ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే... ఓ ప్రైవేట్‌‌ స్లీపర్‌‌ కోచ్‌‌ బస్సు 20 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌‌ నుంచి గురువారం రాత్రి 11 గంటలకు మహారాష్ట్రలోని అకోలాకు బయలుదేరింది. ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉండగా, తెల్లవారుజామున 2.30 గంటల టైంలో ఇందల్వాయి మండలం గన్నారం వద్దకు చేరుకోగానే బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది.

ప్రమాదంలో బస్‌‌ డ్రైవర్‌‌ రాహుల్‌‌ (32)తో పాటు అకోలాకు చెందిన తల్లీకూతూరు మంజూష (30), రుషి (7), అబ్బాస్‌‌ (35) అక్కడికక్కడే చనిపోయారు. మంజూష భర్త లక్ష్మణ్‌‌, కూతురు పెండ్లికి కావాల్సిన సామగ్రి కొనడానికి హైదరాబాద్‌‌ వెళ్లిన అయేషా, డ్రైవర్‌‌కు తోడుగా వచ్చిన అతడి ఫ్రెండ్‌‌ శివశంకర్‌‌తో పాటు మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా, తొమ్మిది మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు.

ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఇందల్వాయి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని, గాయపడిన వారిని అంబులెన్స్‌‌లో జీజీహెచ్‌‌కు తరలించారు. కాగా, డ్రైవర్‌‌ నిద్రమత్తుకు తోడు బస్సును నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.