పక్కన బిడ్డతో క్యాబ్​ డ్రైవింగ్​

పక్కన బిడ్డతో క్యాబ్​ డ్రైవింగ్​

ఇన్‌‌స్పిరేషన్ పొందడం కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన పనిలేదు. చుట్టూ ఉండే మనుషుల్ని ఓసారి కదిలిస్తే చాలు. వాళ్ల జీవితాలు కూడా ఎన్నో విషయాలు నేర్పుతాయి. అలాంటి సంఘటనే జరిగింది బెంగళూరులోని రాహుల్ శశికి. రాహుల్ ఉబర్ క్యాబ్‌‌లో వెళ్తుండగా డ్రైవర్‌‌‌‌తో జరిగిన చిన్న సంభాషణ అతనికి ఎంతో ఇన్‌‌స్పైరింగ్‌‌గా అనిపించింది. దాన్ని లింక్డ్‌‌ఇన్ పోస్ట్ రూపంలో ఇలా రాసుకొచ్చాడు.

“నా కోసం మా ఫ్రెండ్ ఉబర్ క్యాబ్ బుక్ చేశాడు. కాసేపటికి ఒకామె క్యాబ్ డ్రైవ్ చేస్తూ నా ముందుకొచ్చి ఆగింది. క్యాబ్‌‌లో కూర్చున్నాక ముందు సీటులో ఒక పాప నిద్రపోతూ కనిపించింది. ఉండబట్టలేక ‘మేడమ్ తను మీ పాపేనా?’ అని అడిగా. దానికి ఆమె ‘అవును సర్. తనకి ఇప్పుడు సెలవులు. నేను పని చేస్తూనే తనను కూడా చూసుకుంటున్నా’ అని బదులిచ్చింది. ఆమె గురించి అడిగి తెలుసుకున్నాక నాకు తెలిసిందేంటంటే..

ఆ క్యాబ్ డ్రైవర్ పేరు నందిని. తనకు ఎంట్రప్రెనూర్ అవ్వాలన్న కోరిక. అందుకే  తను దాచుకున్న డబ్బంతా పోగేసి  కొన్నేళ్ల క్రితం ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టింది.  కానీ, కొవిడ్ కారణంగా బిజినెస్‌‌లో నష్టపోయింది. తన ఇన్వెస్ట్‌‌మెంట్ అంతా వేస్ట్ అయింది. ఆ తర్వాత ఆమె ఉబర్ డ్రైవర్‌‌‌‌గా మారింది. రోజుకు పన్నెండు గంటలు పని చేస్తుంది. ‘అవసరమైతే ఇంకా ఎక్కువ పని చేస్తా’నంటోంది. తను కోల్పోయిందంతా తిరిగి సంపాదించే వరకూ కష్టపడతానని చెప్తోంది.

నా ట్రిప్ అయిపోయిన తర్వాత ‘మీతో ఒక ఫొటో దిగొచ్చా?’ అని అడిగా. ఎందుకని అడిగిందామె. ‘ఈరోజుల్లో చాలామంది చిన్న చిన్న ఫెయిల్యూర్స్‌‌కే ఎంతగానో కుంగిపోతున్నారు. అలాంటి వాళ్లకు మీ కథ ఓ ఇన్‌‌స్పిరేషన్‌‌గా ఉంటుంది. మీ గురించి ఓ చిన్న పోస్ట్ పెడతా’ అని చెప్పా. ఆమె నవ్వుతూ సరేనంది. ఇదే ఆ ఫోటో” అని రాహుల్ తన పోస్ట్‌‌లో రాసుకొచ్చాడు. ఆ పోస్ట్ చూశాక ఉబర్ కంపెనీ కంట్రీ హెడ్ ప్రభ్‌‌జీత్ రెస్పాండ్ అయ్యాడు. ఆమెకు సపోర్ట్ ఇస్తానని చెప్పాడు. సోషల్ మీడియాలో వేలమంది ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చారు.