అసైన్డ్ భూములను గుంజుకొని ప్రభుత్వం అమ్ముకుంటున్నది

అసైన్డ్ భూములను గుంజుకొని ప్రభుత్వం అమ్ముకుంటున్నది

హైదరాబాద్, వెలుగు:  గజ్వేల్​ నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయంలో కేసీఆర్​కు సవాల్​ విసిరినా.. దాన్ని స్వీకరించలేదని, దమ్ము, ధైర్యం లేకనే తన బానిసలతో తిట్టించి సంబురపడిపోతున్నాడని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ విమర్శించారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్​కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలి. నేను వందకు వంద శాతం గజ్వేల్​ నుంచే పోటీ చేస్తా. కానీ, కేసీఆర్​ గజ్వేల్​ నుంచి పోటీ చేయకుండా ఎక్కడికైనా పారిపోతే అప్పుడు ఆలోచిస్తా” అని ఈటల ధ్వజమెత్తారు. చెన్నూరు ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, ఆయన తన జాతి కోసం మాత్రం ఎప్పుడూ మాట్లాడలేదని విమర్శించారు. ‘‘నీచమైన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం కేసీఆర్. తెలంగాణకు పట్టిన శని, అరిష్టం పోవాలంటే కేసీఆర్​ను ఓడించాలి. ఈ జన్మలో నేను కేసీఆర్​ను ఓడగొట్టకపోతే... నా జన్మకు సార్థకత లేదు. దమ్ము, ధైర్యం ఉంటే నాపై పోటీకి రండి. తేల్చుకుందాం”అంటూ ఈటల చాలెంజ్ చేశారు. 

అసైన్డ్​ భూములు ఇప్పించాలె

హైదరాబాద్ చుట్టుపక్క దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను గుంజుకొని వాటిని ప్రభుత్వం అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా వ్యవహరిస్తోందని ఈటల విమర్శించారు. తనపై విమర్శలు చేస్తున్న బానిసలకు దమ్ముంటే దళితులకు ఆ భూములు ఇప్పించాలని డిమాండ్​ చేశారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, వృద్ధులకు పెన్షన్ లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రిటైర్డ్ అయితే ఉద్యోగులకు డబ్బులిచ్చే దమ్ము లేకనే వారి వయస్సును 61 ఏండ్లకు పెంచారని విమర్శించారు. టీఆర్ఎస్​లో  కేసీఆర్ కంటే తనతోనే ఎక్కువ మందికి పరిచయాలు ఉన్నాయన్నారు. అనవసరంగా తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.

కేసీఆర్​ బొమ్మతో ఎప్పుడూ గెలవలె

తాను పెట్టిన సభను చూసే.. 2004లో కేసీఆర్ టికెట్ ఇచ్చారని ఈటల గుర్తు చేశారు. టీఆర్ఎస్​లో 2004, 2008లో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేను తానే అని చెప్పారు. కేసీఆర్ బొమ్మతో తాను ఎప్పుడూ గెలవలేదని, ప్రజల అభిమానంతోనే విజయం సాధించానని స్పష్టం చేశారు.