మా చావులతోనైనా మా జాతి బతుకులు మారాలి

మా చావులతోనైనా మా జాతి బతుకులు మారాలి
  • నల్లమలలో ఆత్మహత్యకు సిద్ధమైన చెంచు నాయకుల వీడియో వైరల్​
  • అడవిని గాలించి క్షేమంగా తీసుకొచ్చిన పోలీసులు

అమ్రాబాద్, వెలుగు: తమ చావులతోనైనా పాలకులు, అధికారుల్లో కదలిక వచ్చి చెంచుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చెంచు సంఘం నాయకులు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఘటన సోమవారం రాష్ట్రంలో కలకలం రేపింది. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నల్లమలలో కొందరు సూసైడ్​ చేసుకుంటున్నట్లు సోషల్​ మీడియాలో పెట్టిన వీడియో, నోట్​వైరల్​ అయ్యింది. పోలీసులు అడవిని గాలించి వారిని గుర్తించి కాపాడారు. నోట్​ఆధారంగా వివరాలు.. నాగర్​కర్నూల్​జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వులోని సారపల్లికి చెందిన చెంచు యువజన సంఘం నాయకులు చిర్ర రాములు, పెద్దులు, మానయ్య, సైదులు, అంజయ్య అమ్రాబాద్ మండలం తిర్మలాపూర్(బీకే) గ్రామ సమీపంలోని ఏడ్పులమ్మ చేను వద్ద కుల దైవం విగ్రహం ముందు గోడు వెళ్లబోసుకున్నారు. తాత ముత్తాతల నుంచి సర్వే నంబర్1,459లోని 11 ఎకరాలు సాగు చేసుకుంటున్నామని చెప్పారు. అందులోని 2 ఎకరాలకు పట్టా ఉన్నా ప్రస్తుతం సాగు చేయొద్దని అడ్డుకుంటున్నట్లు వాపోయారు. ట్రాక్టర్లను సీజ్​చేయడంతోపాటు లేనిపోని కేసులు పెడుతున్నారని చెప్పారు. చెంచులను అడవి నుంచి తరమేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పాలకులు అధికారులతో కలిసి ఇష్టానుసారంగా అటవీ సంపదను, ఖనిజ సంపదను దోచుకునేందుకు ఇదంతా చేస్తున్నారన్నారు. ఇక్కడ ఒక్కచోటే కాదు నల్లమల వ్యాప్తంగా చెంచులను ఫారెస్ట్ ఆఫీసర్లు వేధిస్తున్నారని బాధపడ్డారు. ఇటీవల రాయలేటి పెంట వద్ద చెంచులకు చెందిన 20 ఇండ్లను నేలమట్టం చేశారని మండిపడ్డారు. ఐటీడీఏ (ఇంటిగ్రేటెడ్​ ట్రైబల్​డెవలప్​మెంట్ ఏజెన్సీ) ద్వారా చెంచుల అభివృద్ధికి కృషి చేయాల్సింది పోయి తమనే వేధిస్తున్నారని వాపోయారు. అడవి అభివృద్ధి పేరుతో మల్లెల తీర్థం, సలేశ్వరం వంటి దేవాలయాల వద్ద షాపులు పెట్టుకోకుండా ఫారెస్టోళ్లు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. భూ ప్రక్షాళన సందర్భంగా గతంలో పట్టాలున్న భూములకు కూడా పట్టాలియ్యలేదని చెప్పారు. విద్య, వైద్యం, రక్షణ అంటూ ప్రచారం చేసుకుంటున్నారే తప్ప అడవుల్లోని తమను ఏ ఒక్కరూ పట్టించుకుంటలేదన్నారు. రిజర్వేషన్లు అమలు చేసి చెంచు జాతిని కాపాడాలని కులదైవాన్ని వేడుకున్నారు. అధికారులు, పాలకుల చుట్టూ తిరిగి అలసిపోయామని, మా చావులతోనైనా న్యాయం జరగాలన్నారు. 

స్పందించిన పోలీసులు..

వీడియో, నోట్​చూసి స్పందించిన అమ్రాబాద్ సీఐ బీసన్న, ఎస్సైలు పోచయ్య, శ్రీను, 10మంది కానిస్టేబుళ్లతో అడవిలో వెతకడం మొదలుపెట్టారు. ఉదయం 9 గంటల నుంచి దాదాపు 7 గంటల పాటు గాలించి నాయకులను పట్టుకున్నారు. స్టేషన్​కు తీసుకెళ్లి కౌన్సిలింగ్​ ఇచ్చారు. పురుగుల మందు కొంచెం తాగగా పక్కనోళ్లు ఆపారని చిర్ర రాములు తెలిపారు. వెంటనే తమతో పెరుగు తాగించేసరికి ఎలాంటి హాని జరగలేదని చెప్పారు.