బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసిన కుటుంబసభ్యులు

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసిన కుటుంబసభ్యులు

బ్రెయిన్‌డెడ్‌ అయిన ఓ వ్యక్తి అవయవాలను దానం చేసి అతని కుటుంబసభ్యులు పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన హైదరాబాద్ ముషీరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో చోటుచేసుకుంది. పొటకారి రాజేష్‌ (30) అనే దినసరి కూలీ ఏప్రిల్ 12 న ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని కుటుంబసభ్యులు ఎల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వైద్యులు అతనికి 72 గంటల పాటు క్రిటికల్ ఇంటెన్సివ్ కేర్ అందించారు. 

అతని ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో రాజేష్ బ్రెయిన్ డెడ్ అయినట్టుగా ప్రముఖ న్యూరోఫిజిషియన్‌ల బృందం ఏప్రిల్ 15న వెల్లడించింది. ఆ తర్వాత జీవందన్ కోఆర్డినేటర్లు, ఆసుపత్రి అధికారులు బ్రెయిన్ డెడ్ అయిన రోగి కుటుంబ సభ్యులతో  కౌన్సెలింగ్ సెషన్‌లు నిర్వహించి, అతని ఆర్గాన్స్ డొనేట్ చేసేలా ప్రోత్సహించారు.

అనంతరం జీవందన్‌ అవయవదాన కార్యక్రమంలో భాగంగా మృతుడి అవయవాలను కుటుంబసభ్యులు దానం చేసేందుకు ఒప్పుకున్నారు. బంధువులు, స్నేహితుల అంగీకారంతో రాజేష్ మూత్రపిండాలు, కార్నియాలను డాక్టర్లు అవయవదాన ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయా పేషెంట్లకు డాక్టర్లు అవయవాలను అమర్చారు.