రైతులు బిచ్చగాళ్లు కారు 

రైతులు బిచ్చగాళ్లు కారు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూములకు గాను యజమానులకు ఏళ్ల తరబడి పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. భూ యజమానులకు పరిహారం చెల్లింపును దాతృత్వంగా భావించొద్దంటూ సర్కారుపై నిప్పులు చెరిగింది. ‘‘ప్రభుత్వాల నిర్వాకం వల్ల కొన్నిసార్లు రైతులకు పరిహారం ఇవ్వకుండానే భూముల్ని సేకరిస్తున్నారు. అటు పరిహారం అందక, ఇటు సాగు భూమి లేక రైతులు నిరాశకులోనై ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలూ ఉన్నాయి” అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘నష్టపోయిన రైతులు, భూ యజమానులు బిచ్చగాళ్లు కాదు. తీసుకున్న భూమికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరడాన్ని అడుక్కోవడంగా భావించొద్దు” అంటూ కామెంట్ చేసింది. నష్టపోయిన భూమికి చట్ట ప్రకారం పరిహారం కోరుతున్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని చీఫ్‌‌ జస్టిస్‌‌ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్‌‌ ఎ. రాజశేఖర్‌‌ రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ తేల్చి చెప్పింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు భూ సేకరణపై1991 అవార్డును ఇంకా అమలు చేయలేదని బక్కూరి లింగన్న, మరో ఐదుగురు వేసిన ధిక్కార పిటిషన్‌‌ను బెంచ్‌‌ శుక్రవారం విచారించింది.

హైకోర్టు గత ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ రామకృష్ణా రావు విచారణకు హాజరయ్యారు. పిటిషనర్లకు లెక్కించిన రూ.52.72 లక్షల పరిహారం చాలా ఎక్కువని గవర్నమెంట్‌‌ స్పెషల్‌‌ ప్లీడర్‌‌ హరేందర్‌‌ పరిషద్‌‌ చెప్పారు. ‘‘వారి భూమి విలువ రూ.10 లక్షలే. ఆ డబ్బును పిటిషనర్ల ఖాతాల్లో వేశాం” అన్నారు. కోర్టుకిచ్చిన హామీ మేరకు పరిహారం చెల్లించలేదని పిటిషనర్‌‌ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ పరిహారంతో ఇప్పుడు పిటిషనర్లు ఎకరం కూడా కొనలేరని జస్టిస్‌‌ రాజశేఖర్‌‌రెడ్డి అన్నారు. గజాల్లో కూడా కొనలేనంతగా భూముల రేట్లు పెరిగాయన్నారు. పరిహారం చెల్లించకుండా భూములను ప్రభుత్వం ఎలా సేకరిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో భూ పరిహారంపై భారీగా కేసులెందుకు దాఖలయ్యాయని సీజే ప్రశ్నించారు. ‘‘భూ పరిహారం చెల్లింపులో జాప్యం తీవ్ర సమస్యగా మారుతోంది. వందలాదిగా పిల్స్, పిటిషన్లు హైకోర్టుకు వస్తున్నాయి. కొన్నిసార్లు భూమి కోల్పోయినా పరిహారమివ్వలేదు. పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం వారి భూమి జోలికి వెళ్లడానికి వీల్లేదని చట్టం చెబుతోంది” అన్నారు. డిసెంబర్‌‌ 16 నాడు పూర్తి వివరాలతో రావాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.