సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్​ .. అమ్మకాల ఒత్తిడితో నష్టాలు

సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్​ .. అమ్మకాల ఒత్తిడితో నష్టాలు

ముంబై: అమ్మకాల ఒత్తిడి కారణంగా ఈక్విటీ బెంచ్‌‌‌‌మార్క్ సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా క్షీణించి 74,000 స్థాయికి దిగువకు పడిపోయింది.  నిఫ్టీ శుక్రవారం రికార్డు గరిష్ట స్థాయి నుంచి వెనక్కి తగ్గింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ కౌంటర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కూడా సూచీలను తగ్గించిందని ట్రేడర్లు తెలిపారు. సెన్సెక్స్ 732.96 పాయింట్లు పడిపోయి 73,878.15 వద్ద స్థిరపడింది. 

ఇంట్రా-డేలో గరిష్ఠ స్థాయి 75,095.18 నుంచి 1,627.45 పాయింట్లు తగ్గి 73,467.73 వద్దకు చేరుకుంది. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ నిఫ్టీ కూడా 172.35 పాయింట్లు క్షీణించి 22,475.85 వద్దకు చేరుకుంది. ప్రారంభ ట్రేడ్‌‌‌‌లో ఇది 146.5 పాయింట్లు పెరిగి 22,794.70 రికార్డును తాకింది. ఈవారంలో సెన్సెక్స్​ 147.99 పాయింట్లు, నిఫ్టీ 55.9 పాయింట్లు లాభపడింది. శుక్రవారం సెన్సెక్స్ బాస్కెట్ నుంచి, లార్సెన్ అండ్​ టూబ్రో, మారుతీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే, భారతీ ఎయిర్‌‌‌‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జేఎస్​డబ్ల్యూ వెనకబడి ఉన్నాయి. 

బజాజ్ ఫైనాన్స్ దాదాపు 1 శాతం పెరిగింది. ఈ కామ్​ ఇన్​స్టా ఈఎంఐ కార్డ్ ద్వారా రుణాల మంజూరుపై విధించిన పరిమితులను ఆర్​బీఐ ఎత్తివేసినట్లు కంపెనీ గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో తెలిపింది. బజాజ్ ఫిన్‌‌‌‌సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ లాభపడిన ఇతర షేర్లలో ఉన్నాయి. బ్రాడ్​ మార్కెట్‌‌‌‌లో, బీఎస్‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌క్యాప్ గేజ్ 0.55 శాతం క్షీణించగా, మిడ్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.21 శాతం క్షీణించింది.

సూచీలూ పతనమే..

సూచీలలో, టెలికమ్యూనికేషన్ 1.42 శాతం, రియల్టీ 1.09 శాతం, సేవలు 1.01 శాతం, టెక్ 0.96 శాతం, వినియోగదారుల విచక్షణ 0.71 శాతం, ఐటీ 0.64 శాతం, కమొడిటీలు 0.29 శాతం పడిపోయాయి.  అయితే, హెల్త్‌‌‌‌కేర్,  మెటల్ లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌ఐఐలు) గురువారం రూ. 964.47 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. ఆసియా మార్కెట్లలో, హాంకాంగ్ సానుకూలంగా, సియోల్ ప్రతికూలంగా ముగిసింది. టోక్యో,  షాంఘై మార్కెట్లు సెలవు కారణంగా మూతపడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు గ్రీన్‌‌‌‌లో ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్ గురువారం లాభాలతో ముగిసింది.   బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌కు 0.06 శాతం క్షీణించి 83.62 డాలర్లకు చేరుకుంది.