కొత్త సంవత్సరంలో అప్పు తీసుకోవాలనుకుంటున్నారా. అయితే బంగారంతోనే కాకుండా వెండిపై కూడా సులువుగా లోన్స్ పొందొచ్చు. ఒకప్పుడు తాకట్టుకు బ్యాంకులు తీసుకోకపోవటంతో బయట కుదువపెట్టుకునే పాన్ బ్రోకర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే రిజర్వు బ్యాంక్ వెండి రుణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. తక్కువ వడ్డీకే నమ్మకమైన భద్రత కలిగిన మార్గాల్లో వెండి రుణాలను వినియోగదారులు పొందటానికి ఇది మార్గాన్ని కల్పించింది.
మీ ఇంట్లో వెండి ఆభరణాలు లేదా కాయిన్స్ ఉంటే అవి ఇప్పుడు రుణం పొందడానికి సహాయపడతాయి. అవును... నిజమే... డబ్బు అవసరమైనప్పుడు గోల్డ్ లోన్స్ లాగానే ఇప్పుడు మీరు వెండిపై లోన్ తీసుకోవచ్చు. వెండి రుణాల కోసం కొత్త మార్గదర్శకాలు 1 ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వస్తాయని ప్రకటిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
బ్యాంకులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలు బంగారు రుణాల మాదిరిగానే వెండి ఆభరణాలు, నాణేలను తాకట్టు పెట్టి రుణాలు ఇవ్వడానికి వీలు కల్పిస్తూ RBI లోన్ నియమాలను అధికారికంగా సవరించింది. రానున్న కొత్త ఆర్థిక సంవత్సరం నుండి అన్ని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు ఇతర సంస్థల ద్వారా కస్టమర్లు ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. బంగారం మాదిరిగానే లోన్ తీసుకొని తిరిగి కట్టకపోతే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలు మీరు తనఖా పెట్టిన వెండి ఆభరణాలను అమ్మి లోన్ మొత్తం డబ్బు రికవరీ చేసే హక్కు ఉంటుంది.
ఎంత వెండిని తాకట్టు పెట్టవచ్చు:
రిజర్వు బ్యాంక్ కొత్త రూల్స్ ప్రకారం.. లోన్ పొందడానికి 10 కిలోల వరకు వెండి తాకట్టు పెట్టొచ్చు. ప్రస్తుతం.. బంగారు రుణాల కోసం కిలో వరకు గోల్డ్ తాకట్టు పెట్టవచ్చు. 2.5 లక్షల విలువైన వెండిని తాకట్టు పెడితే దాని విలువలో 85 శాతం వరకు లోన్ పొందవచ్చు. 5 లక్షల విలువైన వెండికి లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తి 75 శాతానికి పరిమితం చేయబడుతుంది. మీరు లోన్ మొత్తం కట్టిన తర్వాత బ్యాంకులు లేదా NBFCలు తాకట్టు పెట్టిన వెండిని ఏడు రోజుల్లో మీకు తిరిగి ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే రోజుకు రూ. 5వేల చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
