ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక లోకో పైలట్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైలు వెళ్తున్న సమయంలో కేవలం సిగరెట్లు కొనడం కోసం ఏకంగా గూడ్స్ రైలునే రైల్వే క్రాసింగ్ మధ్యలో ఆపేశాడు.
వివరాలు చూస్తే... రాయ్‌బరేలి జిల్లాలోని` మల్కాన్ రైల్వే క్రాసింగ్ వద్ద ఒక పెద్ద గూడ్స్ రైలు సుమారు 10 నిమిషాల పాటు ఆగింది. రైలు ఇంజిన్ క్రాసింగ్‌కి అడ్డుగా ఉండటంతో అటు ఇటు వెళ్లే వాహనాలన్నీ నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ లోకో పైలట్ రైలు దిగి పట్టాలు దాటుకుంటూ వెళ్లడం కనిపిస్తోంది. ఆయన దగ్గరలోని షాపుకి వెళ్లి సిగరెట్లు కొనుక్కుని మళ్లీ రైలు ఎక్కాడని స్థానికులు చెబుతున్నారు. ఈ రైలు NTPC ప్రాజెక్టులో బొగ్గును దించి తిరిగి వస్తున్నట్లు సమాచారం.
ALSO READ | కారులో మ్యూజిక్ సౌండ్ తగ్గించమంటే..మహిళపై దాడి చేసిన ర్యాపిడో క్యాబ్ డ్రైవర్ అరెస్ట్..
ఇలా రైలును మధ్యలో ఆపడం వల్ల గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తుందని వాహనదారులు మండిపడుతున్నారు. దీనిపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించగా... త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
రైల్వేకు సంబంధించిన మరో ప్రమాదకర సంఘటన బాలాఘాట్ ప్రాంతంలో జరిగింది. ఒక వ్యక్తి మద్యం మత్తులో రైల్వే బ్రిడ్జ్ పైకి ఎక్కి పట్టాల మీద నిలబడ్డాడు. వేగంగా వస్తున్న ప్యాసింజర్ రైలు డ్రైవర్ అతన్ని చూసి వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో రైలు పట్టాలపైనే ఒక్కసారిగా ఆగిపోయింది. లోకో పైలట్ అప్రమత్తత వల్ల ఒక ప్రమాదం తప్పింది, కానీ రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
