ప్రపంచాన్ని కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్ స్టీన్ కేసులో కీలక అంశం వెలుగు చూసింది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు బయటికి రావడం కలకలం రేపుతోంది. అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన ఈమెయిల్స్ ప్రకారం, 2014 నుంచి 2017 మధ్య ఎప్స్టీన్‌తో పూరికి వ్యాపార సంబంధాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. డిజిటల్ ఇండియా, భారత ఇంటర్నెట్ రంగంలో పెట్టుబడులపై చర్చలు, లింక్డ్ ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మాన్‌తో పరిచయాల ప్రయత్నాలు ఇందులో ఉన్నాయని విదేశీ మీడియా సంస్థలు వెల్లడించాయి.
న్యూయార్క్‌లోని ఎప్స్టీన్ నివాసంలో పూరి కనీసం మూడు సార్లు భేటీ అయినట్లు పత్రాలు సూచిస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన పూరి, తన భేటీలు పరిమితమైనవని, అవన్నీ పని సంబంధంగానే జరిగాయని తెలిపారు. ఎప్స్టీన్ నేర చరిత్ర అప్పట్లో తనకు తెలియదని, మోదీ ప్రభుత్వంలో చేరకముందే ఈ సమావేశాలు జరిగాయని స్పష్టం చేశారు. దీనిపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్ర మంత్రితో ఎప్స్టీన్ సంబంధాలపై పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. నేర ఆరోపణలు ఏవీ లేనప్పటికీ, ఎప్స్టీన్‌తో కొనసాగిన సంబంధాలు, సమావేశాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
