దుమ్మురేపుతోన్న RCB రూ.2 కోట్ల బౌలర్: కేవలం మూడు మ్యాచుల్లోనే 23 వికెట్లు పడగొట్టిన జాకబ్ డఫీ

దుమ్మురేపుతోన్న RCB రూ.2 కోట్ల బౌలర్: కేవలం మూడు మ్యాచుల్లోనే 23 వికెట్లు పడగొట్టిన జాకబ్ డఫీ

వెస్టిండీస్‎తో జరిగిన మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్‎లో న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ దుమ్మురేపాడు. మూడు మ్యాచుల్లో 23 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‎గా ఎంపికయ్యాడు. తద్వారా జాకబ్ డఫీ రెండు అరుదైన రికార్డులు  సృష్టించాడు. న్యూజిలాండ్ తరుఫున ఒక క్యాలెండర్ ఇయర్ (2025)లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‎గా చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది 36 మ్యాచ్‌ల్లో 81 వికెట్లు పడగొట్టిన డఫీ.. న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం రిచర్డ్ హాడ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. 

1985లో 23 మ్యాచ్‌ల్లో రిచర్డ్ హాడ్లీ 79 వికెట్లు తీయగా తాజాగా ఈ రికార్డును డఫీ అధిగమించాడు. దీంతో పాటు మరో రికార్డును డఫీ తన పేరిట లిఖించుకున్నాడు. వెస్టిండీస్‎తో జరిగిన టెస్టు సిరీస్‎లో 23 వికెట్లు తీసి.. స్వదేశంలో జరిగిన సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన న్యూజిలాండ్ పేసర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో ఈ రికార్డ్ న్యూజిలాండ్ స్టార్ బౌలర్ బౌల్ట్ పేరిట ఉండేది. బౌల్ట్ 2013లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో 20 వికెట్లు పడగొట్టాడు. 

ఇదిలా ఉంటే.. జాకబ్ డఫీ రాణించడంతో ఆర్సీబీ యాజమాన్యంతో పాటు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన 2026 ఐపీఎల్ మినీ వేలంలో డఫీని ఆర్సీబీ కొనుగోలు చేసింది. భారీ అంచనాల నడుమ వేలంలోకి వచ్చిన డఫీని ఆర్సీబీ కేవలం 2 కోట్ల రూపాయలకే వ్యూహాత్మకంగా దక్కించుకుంది. ఈ క్రమంలో డఫీ వికెట్ల మీద వికెట్లు తీస్తుంటే ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. సొంత దేశం తరుఫున దుమ్మురేపుతోన్న డఫీ.. ఐపీఎల్‎లో ఆర్సీబీ తరుఫున ఎలా రాణిస్తాడో చూడాలి మరీ.