క్వింటాల్​కు 8 కిలోల తరుగు

క్వింటాల్​కు 8 కిలోల తరుగు

శాయంపేట, వెలుగు: క్వింటాల్​వడ్లకు 8 కిలోల వరకు తరుగు తీస్తుండడంతో కడుపు మండిన రైతన్నలు వడ్లకు నిప్పు పెట్టి ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు మొదట బస్తాకు 40.7 కిలోల చొప్పున రైతుల దగ్గర సరిగ్గానే వడ్లు తూకం వేసి మిల్లర్లకు అప్పగించారు. తర్వాత మిల్లర్లు కోత పెడుతున్నారంటూ 42.7 కిలోల చొప్పున తూకం వేయడం మొదలుపెట్టారు. ఒక్క లోడ్​ తరువాత మిల్లర్లు లారీని వెనక్కి పంపించారంటూ, బస్తాకు 44 కిలోలైతేనే కాంటాలు వేస్తామని చెప్పారు. అంటే బస్తాకు 3.3 కిలోల చొప్పున క్వింటాకు 8 కిలోల వరకు తరుగు తీస్తామన్నారు. దీంతో కడుపుమండిన రైతులు నిర్వాహకులను నిలదీశారు. వారు ఎంతకూ ఒప్పుకోకపోవడంతో సెంటర్​కు తెచ్చిన వడ్లలో కొన్నింటిని కొనుగోలు కేంద్రం దగ్గరే కుప్పగా పోసి నిప్పుపెట్టారు. ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పెండ్లాల మెడలో పుస్తెలతాడు అమ్ముకుని పంట పండించామని, నెల నుంచి సెంటర్ల వద్ద వడ్లు పోసుకుని కాపలా కాస్తుంటే.. మిల్లర్లు, లీడర్లు కలిసి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే తరుగు పోగా ప్రభుత్వం అందించే మద్దతు ధర రూ. 1,960 బదులు రూ.1,700 అవుతుందన్నారు. ఇలాగే నిర్వాహకులు మొండికేస్తే రైతులంతా కలిసి కలెక్టరేట్​దగ్గర ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.

పోలీసులకు కంప్లైంట్​చేసిన రైతులు
చొప్పదండి, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి పంపించిన వడ్లు తక్కువగా ఉన్నాయంటూ మిల్లర్లు మోసానికి పాల్పడుతున్నారని రైతులు పోలీసులకు కంప్లైంట్​ చేశారు. కరీంనగర్​జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం సెంటర్ నుంచి గత నెల 24న లారీలో 699 బస్తాలను హుజురాబాద్, రంగాపూర్​లోని విఘ్నేశ్వర రైస్ మిల్లుకు పంపించారు. పంపించే ముందు వే బ్రిడ్జి దగ్గర లోడ్​కాంటా పెట్టారు. అయితే మిల్లుకు వెళ్లాక ఈ లారీ లోడ్​ను వారి వేబ్రిడ్జిలో తూకం వేయించగా 59 బస్తాలు(22.84 క్వింటాళ్లు) తక్కువగా వచ్చాయని మిల్లరు సెంటర్ నిర్వాహకులకు ఫోన్ చేసి చెప్పాడు. షార్టేజీ వచ్చిన వడ్లను తీసేసి బిల్లు చేసి పంపిస్తానని, లేదంటే లోడ్ రిటర్న్​చేసుకోవాలని చెప్పాడు. అదే రోజు రుక్మాపూర్ సెంటర్ నుంచి విఘ్నేశ్వర మిల్లుకు పంపించిన లోడ్​లో కూడా 18 క్వింటాళ్లు షార్టేజీ ఉన్నాయంటూ వారికి కూడా బిల్లు చేయకుండా పక్కన పెట్టారు. దీంతో షార్టేజీ పేరిట మిల్లరు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, మిల్లుపై తగిన చర్యలు తీసుకోవాలని ప్యాక్స్ చైర్మన్ వెల్మ మల్లారెడ్డి బాధిత రైతులతో కలిసి జిల్లా కలెక్టర్, చొప్పదండి సీఐకి కంప్లైంట్ చేశారు. సెంటర్ నిర్వాకులు, రైతులు, హమాలీల సమక్షంలో 41 లోల చొప్పున తూకం వేసి లోడ్ చేసి పంపిన వడ్లలో షార్టేజీ ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు.