అమ్మోనియా గ్యాస్‌ లీకై 15 మందికి అస్వస్థత

అమ్మోనియా గ్యాస్‌ లీకై  15 మందికి అస్వస్థత

అమ్మోనియా గ్యాస్‌ లీకై 15 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ ఫతేనగర్‌లో 2023 జూన్ 29 గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.  పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..  ఫతేనగర్‌లోని పైప్‌లైన్‌ రోడ్డు చివరన చెత్తకుప్పల్లో గ్యాస్‌ కటింగ్‌ చేసేందుకు ఉపయోగించే రెండు అమ్మోనియా గ్యాస్‌ సిలిండర్లు చాలా కాలం నుంచి పడి ఉన్నాయి. 

అయితే అటు వైపుగా వచ్చిన ఓ దొంగ.. గ్యాస్‌ సిలిండర్లకున్న ఇత్తడి వాల్వ్‌లు తీసుకునేందుకు సిలిండర్‌ వాల్వ్‌ను రాడ్డుతో కొట్టి తొలగించబోయాడు. దీంతో ఒక్కసారిగా సిలిండర్‌ నుంచి పెద్ద ఎత్తున అమ్మోనియా గ్యాస్‌ లీక్‌ అయింది.  దీంతో దొంగ అక్కడినుంచి పారిపోయాడు. ఈ క్రమంలో 10 నుంచి 12 మీటర్లు ఎత్తులో గ్యాస్ లీకైంది. 

దీంతో సమీపంలోని  కంపెనీలో పనిచేస్తున్న  10మంది బీహార్ కార్మికులు,  కాలనీ వాసులు ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు.   అస్వస్థతకు గురైన బాధితులను బాలానగర్‌లోని బీబీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. 

గ్యాస్‌ లీకైన ప్రాంతంలో పెద్ద విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కూడా ఉందని, అదృష్టవశాత్తూ అగ్గి రాజుకోలేదని స్థానికులు తెలిపారు. స్థానికంగా ఈ ఘటన బస్తీవాసులను భయాందోళనకు గురిచేసింది.