సిటీలో అనుమతులు లేకుండా రోడ్లపై షూటింగ్స్

సిటీలో అనుమతులు లేకుండా రోడ్లపై షూటింగ్స్

హైదరాబాద్​, వెలుగు: సిటీలో లింక్ రోడ్లపై అనుమతులు లేకుండా జరుగుతున్న సినిమా, సీరియల్ షూటింగ్స్ ​వాహనదారులను ఇబ్బంది పెడుతున్నాయి.  మెయిన్ రోడ్లకు కనెక్టివిటీ పెంచడంతోపాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి జీహెచ్ఎంసీ సిటీలో లింక్ రోడ్లను నిర్మిస్తోంది. వందల కోట్లు ఖర్చు పెట్టి  బల్దియా లింక్ రోడ్లను వేస్తుంటే వాటిని ఇష్టానుసారంగా షూటింగ్​ల పేరుతో కొందరు బ్లాక్ చేస్తున్నారు. రాత్రివేళల్లో  కొన్ని చోట్ల లింక్ రోడ్లను బ్లాక్​ చేసి మరీ  షూటింగ్​లు చేస్తున్నారు.  రాత్రి 10 గంటల తర్వాత బారికేడ్లను అడ్డం పెడుతున్నారు.  వాటి దగ్గర బౌన్సర్లు  కూడా ఉంటున్నారు. మెయిన్​ రోడ్లపై  సైతం  ఇలాగే చేస్తున్నారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం  షార్ట్​ ఫిలిమ్స్, పెద్ద సినిమాలు, సీరియల్స్​ షూటింగ్​ లు జరగుతున్నాయి.  కానీ నిర్వాహకులు వాటికి అనుమతులు మాత్రం తీసుకోవడం లేదు.

ప్రమాదాలకు బాధ్యులెవరు?

సిటీ, శివారు ప్రాంతాల్లో రోడ్లపై  ఈ షూటింగ్​ల వల్ల ప్రమాదాలు  జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 3న రాయదుర్గం నుంచి బయోడైవర్సిటీ వెళ్లేందుకు కొత్తగా నిర్మించిన లింక్ రోడ్డుని ఓ పక్క కొందరు పూర్తిగా క్లోజ్​ చేశారు. అంతేకాకుండా అటునుంచి ఎవరు రాకుండా బారికేడ్లని పెట్టి , ముగ్గురు బౌన్సర్లని సైతం ఉంచారు.   స్థానికులు వారిని ప్రశ్నిస్తే..  జీహెచ్ఎంసీ పనుల వల్ల బంద్​ చేసినట్లు తెలిపారు. ఇటీవల వేసిన రోడ్డుపై ఏం పనులు చేస్తున్నారని జనం ప్రశ్నించగా, షూటింగ్​ కోసం బంద్​ పెట్టినట్లు అక్కడ ఉన్న వారు చెప్పారు. స్థానికులకు, షూటింగ్​చేస్తున్న వారికి మధ్య  గొడవ జరిగింది.  దీంతో కొద్దిసేపు రోడ్డుని ఓపెన్ చేసి  మళ్లీ క్లోజ్​ చేశారు. ఇలా అన్నిచోట్లా రాత్రి వేళల్లో ఏదో కారణం చెబుతూ రోడ్లను బ్లాక్​ చేస్తున్నారు. వీరికి కొందరు స్థానిక పోలీసులు సహాకారం అందిస్తున్నట్లు సమాచారం.

రోడ్లు బ్లాక్​ చేస్తే ఎట్లా?

రాత్రి పూట రోడ్లను ఇష్టానుసారంగా క్లోజ్ చేస్తే ఎట్లా?  ఇటీవల రాయదుర్గం నుంచి బయోడైవర్సిటీ వెళ్లే లింక్ రోడ్డుపై ఓ పక్క రోడ్లుని బ్లాక్​ చేసి షూటింగ్​ తీస్తున్నారు. వన్ వే లో బైక్​పై వెహికల్స్​ వెళ్తుండగా.. ఎదురుగా నాపైకి కారు దూసుకొచ్చింది. త్రుటిలో తప్పించుకుని ప్రమాదం నుంచి బయటపడ్డా. 
- టి.రాఘవేందర్, వాహనదారుడు

రోడ్లు వేసింది ఎవరి కోసం.. 

కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లను వేస్తుంటే ఆ రోడ్లను ఇష్టమొచ్చినట్లు బ్లాక్​ చేస్తే ఎలా?  రాత్రి 7 దాటిందంటే చాలా రోడ్లపై షూటింగ్స్​ జరుగుతున్నాయి.  షూటింగ్ కోసం జనాలను ఇబ్బంది పెడ్తరా? లింక్ రోడ్లను జీహెచ్ఎంసీ నిర్మించింది షూటింగ్​ ల కోసమా? జనం కోసమా? ఎవరికి ఇబ్బంది లేకుండా షూటింగ్​ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలె. 
- శ్రీనివాస్ సాగర్, వాహనదారుడు