ఒకే ఒక్కడు ఫ్లైట్‌‌ హైజాక్ చేసిండు

ఒకే ఒక్కడు ఫ్లైట్‌‌ హైజాక్ చేసిండు

విమానాన్ని హైజాక్ చేయడమంటే మామూలు విషయం కాదు. చాలా ప్లాన్‌‌ చేసుకోవాలి. ఒక టీంని బిల్డ్ చేసుకోవాలి. వెపన్స్‌‌, గుర్తు పట్టకుండా ఉండేందుకు ఫేక్‌‌ ఐడెంటిటీ.. ఇలా చాలా ఉంటాయి. కానీ.. అమెరికాలో ఒకాయన అవేమీ లేకుండా చాలా సింపుల్‌‌గా విమానాన్ని హైజాక్‌‌ చేశాడు. కనీసం కూర్చున్న సీటులో నుంచి లేవకుండానే గవర్నమెంట్‌‌ని వణికించాడు. అతను ఎవరనేది ఇప్పటికీ వీడని మిస్టరీ.  

అది 1971 నవంబర్ 24. అమెరికాలోని ఒరెగాన్ నుంచి వాషింగ్టన్‌‌లోని సీటెల్ వెళ్లేందుకు నార్త్​వెస్ట్ ఎయిర్‌‌లైన్స్‌‌కి చెందిన ఫ్లైట్‌‌–305 రెడీ అయింది. అది ఒక బోయింగ్‌‌ 727 ఎయిర్ క్రాఫ్ట్‌‌. అప్పటికే అందరూ విమానం ఎక్కేశారు. చివరగా ఒక వ్యక్తి ఎక్కాడు. అతను 20 డాలర్లు పెట్టి వన్ వే టికెట్ కొన్నాడు. పేరు డానియల్ కూపర్. వయసు దాదాపు 40 ఏండ్లు ఉంటుంది. ఖరీదైన సూట్‌‌ వేసుకున్నాడు. బాగా చదువుకున్నవాడిలా ఉన్నాడు. గోధుమ రంగు కలర్ షూ, వైట్ షర్ట్, బ్లాక్ టైతో  చాలా డిగ్నిటీగా కనిపిస్తున్నాడు. చేతిలో ఒక సూట్‌‌కేస్‌‌ ఉంది. నేరుగా వెళ్లి అతనికి కేటాయించిన 18సి సీటులో కూర్చున్నాడు. ఇంతలో ఫ్లైట్ టేకాఫ్‌‌ అయింది. మరో ముప్పై నిమిషాల్లో సీటెల్‌‌కు చేరుకుంటుందనగా కూపర్‌‌‌‌ అటెండెంట్‌‌ ఫ్లోరెన్స్ షాఫ్నర్​ను పిలిచి బోర్బన్, సోడా కావాలని అడిగాడు. ఆమె వాటిని తీసుకొచ్చి అతని చేతికిచ్చింది. అతను ఫ్లోరెన్స్ చేతికి చిన్న చీటీ ఇచ్చాడు. ఆ చీటీలో తన ఫోన్‌‌ నెంబర్ రాసి ఇచ్చాడేమో అనుకుని దాన్ని తెరవకుండానే జేబులో పెట్టుకుంది. కూపర్ ఆమె వైపు చూసి.. ‘‘మిస్.. మీరు ఆ చీటీని ఇప్పుడే చూస్తే మంచిది. నా దగ్గర బాంబు ఉంది” అని చిన్నగా చెప్పాడు. 

సూట్‌‌కేస్​లో బాంబు

ఆ మాట విన్న ఫ్లోరెన్స్‌‌ ముందు కాస్త కంగారు పడినా.. అతను ఆట పట్టిస్తున్నాడు అనుకుంది. కూపర్‌‌ ఆమెని‌‌ ‘నా పక్క సీటులో కూర్చో’ అని చెప్పాడు. ఫ్లోరెన్స్‌‌ వెంటనే అతని పక్కన కూర్చుంది. తన దగ్గరున్న సూట్‌‌కేస్‌‌ తెరిచి చూపించాడు. అందులో ఎర్రటి సిలిండర్ల లాంటి డైనమైట్ బాంబులు ఎనిమిది ఉన్నాయి. ఒకదానితో మరొకదానికి వైర్లతో కనెక్షన్‌‌ ఉంది. వాటితో పాటు ఒక బ్యాటరీ కూడా ఉంది. అవన్నీ చూసిన ఫ్లోరెన్స్‌‌ అతను చెప్పిందే నిజమని నమ్మింది. అరిస్తే అందరికీ తెలిసిపోతుందని.. కూపర్‌‌‌‌ని చిన్నగా ‘‘నీకు ఏం కావాలి?”అని అడిగింది. అప్పుడు కూపర్‌‌‌‌ రెండు లక్షల అమెరికన్ డాలర్లు, నాలుగు పారాచ్యూట్‌‌లు ఇవ్వాలని డిమాండ్‌‌ చేశాడు. అంతేకాదు సీటెల్‌‌లో ఫ్లైట్‌‌ ల్యాండ్ కాగానే ఫ్యూయల్‌‌ నింపాలని చెప్పాడు. ఈ విషయాన్ని ఫ్లోరెన్స్‌‌ పైలెట్లకు చెప్తే, వాళ్లు ఎయిర్‌‌పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌‌ ద్వారా పై అధికారులకు చెప్పారు. వాళ్లు పోలీసులకు, ఎఫ్‌‌బీఐకి ఇన్ఫర్మేషన్‌‌ ఇచ్చారు. 

రెండు గంటలు గాల్లోనే..

కూపర్‌‌‌‌ డిమాండ్ల గురించి ఆలోచించుకునేందుకు కాస్త టైం పడుతుందని అధికారులు చెప్పారు. దాంతో అంతవరకు ఫ్లైట్‌‌ని గాల్లోని ఉంచాలన్నాడు. వెంటనే పైలెట్లు చిన్న మెకానికల్ ప్రాబ్లం వల్ల సీటెల్ వెళ్లడానికి కాస్త లేట్‌‌ అవుతుందని ప్యాసింజర్స్‌‌కి చెప్పారు. తర్వాత కొద్దిసేపటికే కూపర్ డిమాండ్లకు అధికారులు ఒప్పుకున్నారు. హైజాకర్‌‌‌‌కి సహకరించాలని సిబ్బందికి ఆర్డర్స్‌‌ ఇచ్చారు. సీటెల్ పోలీసులు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌‌ రెండు గంటల్లో కూపర్‌‌‌‌కు కావాల్సినవన్నీ ఏర్పాటు చేశారు. అంతవరకు విమానం గాల్లోనే తిరిగింది. తర్వాత సీటెల్ ఎయిర్‌‌పోర్టులో ల్యాండ్ అయింది. 

డబ్బుతో జంప్‌‌

ఫ్లైట్ ల్యాండ్ కాగానే అధికారులు డబ్బు, పారాచూట్లు లోపలికి పంపించారు. ఫ్లైట్‌‌లో ఫ్యూయల్‌‌ నింపారు. ఆ తర్వాత కొంత మంది సిబ్బంది, పైలెట్లు తప్ప మిగతావాళ్లంతా దిగారు. తర్వాత విమానాన్ని మెక్సికో సిటీ వైపు తీసుకెళ్లమని చెప్పాడు. ఫ్లైట్‌‌ని పది వేల అడుగుల కంటే పైకి వెళ్లకుండా నడపాలని చెప్పాడు. సీటెల్ నుంచి విమానం టేకాఫ్ అయింది. కాసేపు ప్రయాణం చేశాక.. రాత్రి 8 గంటలకు విమానం వెనక డోర్‌‌‌‌ తెరిపించి పారాచూట్స్‌‌, సూట్‌‌కేస్‌‌, డబ్బుల బ్యాగ్‌‌తో కిందకి దూకేశాడు. ఆ ప్రాంతం సీటెల్, రెనో మధ్యలో ఉంటుంది. అతను దూకిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతంలో గాలించారు. కానీ.. ఆచూకీ దొరకలేదు. అతను ఎవరు? బాంబును ఎలా తీసుకొచ్చాడు? అతని లక్ష్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి ఎఫ్‌‌బీఐ ప్రయత్నించింది. కానీ.. ఒక్క ప్రశ్నకూ సమాధానం దొరకలేదు. అతని అసలు పేరు ఏంటనేది కూడా తెలియదు. టికెట్‌‌ కొనుక్కునేటప్పుడు తన పేరు డానియల్‌‌ కూపర్ అని చెప్పాడు. కానీ.. మీడియాలో డీబీ కూపర్‌‌గా పబ్లిష్‌‌ అయింది. అమెరికాలో  ఈ డీబీ కూపర్‌‌‌‌ కేసు పేరుతో డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. దాదాపు యాభై ఏండ్లపాటు ఈ కేసుపై విచారణ జరిపారు. అయినా ఒక్క క్లూ కూడా కనిపెట్టలేకపోయారు. 

డబ్బు ఖర్చు పెట్టలేదు

కూపర్‌‌‌‌ తనకు ఇచ్చిన డబ్బును ఎక్కడో ఒక చోట ఖర్చు పెడతాడనే ఉద్దేశంతో అధికారులు ఆ నోట్ల సీరియల్‌‌ నెంబర్లు నోట్‌‌ చేసుకున్నారు. అవి చెలామణీలోకి వచ్చినప్పుడు గుర్తించి, కూపర్‌‌‌‌ని పట్టుకోవాలనేది వాళ్ల ప్లాన్‌‌. కూపర్ తప్పించుకున్న నెల తర్వాత ఆ సీరియల్‌‌ నెంబర్లను మీడియాకు రిలీజ్ చేశారు. వాటిని గుర్తించి, పోలీసులకు ఇన్ఫర్మేషన్‌‌ ఇస్తే పాతిక వేల డాలర్లు ఇస్తామని ప్రకటించారు. కానీ.. ఆ డబ్బులోని ఒక్క నోటు కూడా చెలామణీలోకి రాలేదు. ఒకట్రెండు సార్లు కొందరు ఆ నెంబర్లతో ఉన్న నోట్లను పోలీసులకు ఇచ్చారు. కానీ.. అవి ఫేక్ అని తేలింది. 

అయినా దొరకలేదు 

కూపర్ కిందికి దూకిన తర్వాత ఏమయ్యాడు? అని తెలుసుకునేందుకు ఎఫ్‌‌బీఐ ఎన్నో ప్రయత్నాలు చేసింది. అతడు జంప్ చేసిన ప్లేస్‌‌లో వెతికించింది. కానీ.. ఆనవాళ్లు దొరకలేదు. కాకపోతే.. అతను కిందికి దూకినప్పుడు గాలి ఎక్కువగా వీస్తోంది. వర్షం పడుతోంది. పైగా అతను హెల్మెట్‌‌ పెట్టుకోలేదు. కాబట్టి ఎక్కడో ఒక చోట పడి చనిపోయి ఉంటాడని చెప్పింది. చనిపోతే అతని శవం అయినా దొరకాలి కదా? అంటే.. దానికి కూడా వాళ్ల నుంచి సమాధానం రాలేదు. చివరివరకు ఎఫ్‌‌బీఐ ఈ మిస్టీరియస్‌‌ కేసును ఛేదించలేక 2016లో కేసు కొట్టేసింది.