47 ఊళ్లకు వరద ముప్పు

47 ఊళ్లకు వరద ముప్పు

గత ఏడాది  గోదావరి వరదలొచ్చాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని బెస్తవాడ, ఎస్సీ కాలనీ, రామన్నగూడెం, కొత్తూరు, బుట్టాయి గూడెం గ్రామాలకు చెందిన 456 మందిని ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన పునరావాసకేంద్రాలకు తరలించారు. మంగపేట మండలంలోని అక్కినపల్లి, పోదూర్, కమలాపూర్, వాడగూడెం, కత్తిగూడెం, రమనక్కపేట, గుడ్డేగులపల్లి, బోర్ నర్సాపూర్ గ్రామాల్లోని 600 మందిని కమలాపూర్​లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు, వాజేడు బీసీ కాలనీ, రామాలయం వీధి పెద్దగొల్లగూడెం, క్రిష్ణాపురం, టేకులగూడెం, పెద్దగంగారం, వెంగళరావుపేట, లక్ష్మీపురం, టేకులబోరు, కొరసవానిగూడెం, అలుబాక, బోదపురం, గుమ్మడి దొడ్డిలకు చెందిన 234 కుటుంబాలను పాత్రపురం గవర్నమెంట్​ స్కూలు, ఐటీఐ బిల్డింగ్​లకు తరలించారు.


ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన మాసిన నాగేశ్వరరావు కుటుంబానికి 1986కు ముందు  గోదావరి పక్కనే ఉన్న మర్రిగూడెంలో  18 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. ఊర్లో వీరిది మోతుబరి కుటుంబం. ప్రతియేటా గోదావరికి వరదలు రావడం,  భూములు కోతకు గురవడంతో ఏటా ఎకరమో.. అరెకరమో  గోదావరిలో కలిసిపోయేది. 34 ఏళ్లు గడిచేసరికి నాగేశ్వరరావు కుటుంబానికి కేవలం 2 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది.
మిర్చి పంట మునిగింది.. 
ఏటా వరదలు వచ్చి  మిర్చి పంట మునిగిపోతుంది.  ఎకరానికి రూ.50 వేల నుంచి 70 వేల వరకు లాస్​ వస్తుంది.  ఆఫీసర్లు వచ్చి సర్వే చేసినా ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం రాలేదు. ఒక్క వెంకటాపురం మండలంలోనే రెండు వేల ఎకరాల్లో  మిర్చి దెబ్బతిన్నది. పొలాలను వరద ముంచేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలి 
- అట్లూరి రఘురామ్, మిర్చి రైతు, వెంకటాపురం
కరకట్టలు నిర్మించాలి
ఇప్పుడు ఉన్న కరకట్ట కోతకు గురవుతోంది. ఇసుక బస్తాలను అడ్డం వేస్తున్నా.. అవి తట్టుకోవడం లేదు. కొత్త కరకట్ట పటిష్టంగా నిర్మించాలి. వరదొచ్చినప్పుడే అధికారులు హడావుడి పడుతున్నారు. బాధితులను రాత్రి పూట సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఇబ్బందిగా ఉంటోంది.
                    - చిటమట రఘు, ఏటూరునాగారం

 జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు: గోదావరికి కరకట్టలు కట్టకపోవడంవల్ల ప్రతి ఏటా తీరగ్రామాలను వరద ముంచెత్తుతోంది. ఇండ్లు, పొలాలు నీటిలో మునిగిపోతున్నాయి. దాదాపు 47 గ్రామాలకు చెందిన ప్రజలను వరదొచ్చినప్పుడల్లా  సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వరద తగ్గేదాకా షెల్టర్లలో ఉంచుతున్నారు. ఇంతకు ముందున్న కరకట్టలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరదను తట్టుకోలేకపోతున్నాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు..  కరకట్టలను నిర్మించేందుకు ఫండ్స్​ సాంక్షన్​ అయినా ఇంకా పనులు ప్రారంభించలేదు. దీంతో ఈ ఏడాది కూడా  వరద ముప్పు తప్పేలా లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 
ప్రమాదం అంచున 47 గ్రామాలు
ములుగు జిల్లాలోని 5 మండలాల పరిధిలో ఉన్న 47 గ్రామాలు గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా మునిగిపోతున్నాయి. వేలాది మంది ప్రజలు అరిగోస పడుతున్నారు. మంగపేట మండలంలోని కమలాపురం, మంగపేట,  అక్కినపల్లి,  మల్లారం.. వెంకటాపురం మండలంలోని మరికల, బూరుక గూడెం, మర్రిగుడెం, చొక్కల, ఉప్పెడు, గొల్లగూడెం, టేకుల బోరు, పాత్రపురం, వీరభద్రవరం, అంకన్నగూడెం, యాకన్నగూడెం, అలుబాక, బోదపురం, కొడాపురం, సురవీడు, ఎదిర..  కన్నాయి గూడెం మండలంలోని తుపాకుల గూడెం, దేవాదుల, లక్ష్మీపురం, రాజన్నపేట, గంగారం, కన్నాయిగూడెం, ముప్పనపల్లి, సింగారం, ఎటూరు, చింతలగూడెం, కంతనపల్లి.. ఏటూరునాగారం మండలంలోని ముళ్ళకట్ట, రంగరాజుపల్లి, రొయ్యూరు, ఏటూరునాగారం, రామన్నగూడెం.. వాజేడు మండలంలోని టేకులగూడెం, చంద్రుపట్ల, పేరూరు, ధర్మారం, చింతూరు, ఆర్లగూడెం, వాజేడు, పూసూరు, ఏడుచర్లపల్లిలను ఆఫీసర్లు గోదావరి ముంపు గ్రామాలుగా గుర్తించారు.  భారీ వర్షాలు పడిన ప్రతీసారి ఈ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి పునారావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 
2వేల ఎకరాలు కోత
గోదావరి ఉగ్రరూపం దాల్చినప్పుడల్లా తీర ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములు కోతకు గురవుతున్నాయి. దీంతో రైతుల విలువైన పంట భూములు గోదావరిలో కలిసిపోతున్నాయి. ములుగు జిల్లాలో 9 మండలాలుండగా 5 మండలాలలో గోదావరి ముంపు ప్రాంతం ఉంది.  వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాలలో వేలాది మంది రైతులు తమ విలువైన భూములను కోల్పోయారు. గత ముప్పైఏండ్లలో దాదాపు  2 వేల ఎకరాల వ్యవసాయ భూములు గోదావరి నీటిలో కొట్టుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు. గోదావరి పొడువునా కరకట్టలు నిర్మిస్తే పొలాలు కొట్టుకుపోయేవి కాదని రైతులు అంటున్నారు. 
ఫండ్స్​ శాంక్షన్​ అయినా.. 
గోదావరి కరకట్టల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.137 కోట్లు మంజూరు చేసింది. ఫండ్స్​ శాంక్షన్​చేసి ఏడాదిదాటినా ఇంకా టెండర్లు కూడా పిలువలేదు. గతేడాది మునిపోయిన ఊళ్లలో జనాన్ని  ఎంపీ మాలోతు కవిత పరామర్శించేందుకు రాగా..  కరకట్టలు ఎందుకు కట్టడంలేదని  నిలదీశారు.  ఫండ్స్​ శాంక్షన్​ అయినా పనులు మొదలుపెట్టకపోవడాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క తప్పుబట్టారు. ఆమె ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లోనూ లేవనెత్తారు.  వెంటనే పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.