రెండో ఎక్కం రానివాళ్లతో పేపర్లు దిద్దించారు : ఓ తండ్రి ఆవేదన

రెండో ఎక్కం రానివాళ్లతో పేపర్లు దిద్దించారు : ఓ తండ్రి ఆవేదన

ఇంటర్ పరీక్ష ఫలితాల్లో తప్పులపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారు. నాంపల్లి లోని ఇంటర్ బోర్డ్ దగ్గరకు వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. హయత్ నగర్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి.. తన కూతురుకు ఫలితాల్లో అన్యాయం జరిగిందంటూ ఇంటర్ బోర్డ్ ఆఫీస్ కు వచ్చాడు. తన కూతురు చిన్నప్పటినుంచి ఫెయిల్ అంటే తెలియదని… ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారుల తీరు కారణంగా తన కూతురు మొట్టమొదటిసారిగా ఫెయిల్ అయిందని ఆయన ఆవేదనగా చెప్పారు.

“చిన్నప్పటినుంచి  నా కూతురు టాపర్. నా కొడుకు ఐదో తరగతిలో తప్పితే మళ్లీ చదివించాను. నా కూతురు ఇంటర్ ఫస్టియర్. చిన్నప్పటినుంచి ఏనాడూ తప్పలేదు. అన్ని సబ్జెక్టుల్లో 90, 80ల్లో మార్కులు వస్తే.. మాథమేటిక్స్ లో 12 మార్కులు వేశారండీ. నా కూతురు మ్యాథమేటిక్స్ లో జెమ్. కానీ అధికారుల పాపానికి నా పాప బలైపోయింది” అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు ఆ తండ్రి.

తెలంగాణ ప్రభుత్వం లెక్కల్లో ఫెయిల్

తెలంగాణ ప్రభుత్వం లెక్కల్లో ఫెయిలైందని తీవ్రంగా ఆరోపించారు ఆ తండ్రి. “కనీసం రెండో ఎక్కం రాని వెధవలతో పేపర్లు దిద్దించారండీ. లెక్కలు, ఎక్కాలు, సూత్రాలు తెలియని వారితో పేపర్లు కరెక్షన్ చేయించారు. ఇది అమానుషం. పిల్లల జీవితాలతో ఆటలాడుతున్నారు” అని ఆయన ఘాటుగా విమర్శించారు.