లైఫ్​తో గేమ్స్​ : ఆన్​లైన్​ ఆటలతో ఆగమవుతున్న బతుకులు

లైఫ్​తో గేమ్స్​ : ఆన్​లైన్​ ఆటలతో ఆగమవుతున్న బతుకులు

పెయిడ్ గేమ్స్​లో డబ్బులు పెట్టి అప్పుల పాలవుతున్న యూత్​ 
తిరిగి కట్టలేక సూసైడ్లు, మర్డర్లు, ఇతర నేరాలు 
20 నుంచి 35  ఏండ్లలోపు వారే ఎక్కువ
ముందే గుర్తించకుంటే ప్రమాదమని డాక్టర్ల హెచ్చరిక

“హైదరాబాద్​లోని వనస్థలిపురం ఏరియాకు చెందిన జగదీశ్​డయాగ్నస్టిక్స్​ సెంటర్ నిర్వహించే వాడు. సరదాగా ఆన్​లైన్​గేమ్స్​ ఆడటం మొదలుపెట్టాడు. మొదట్లో కాసిన్ని డబ్బులు వచ్చాయి. దాంతో మరింత ఎక్కువ సేపు ఆడుతూ బానిసయ్యాడు. వరుసగా నష్టపోతున్నా ఆడుతూనే రూ.12 లక్షలు అప్పులు చేశాడు. ఆ అప్పులను తండ్రి తీర్చేసినా.. మళ్లీ గేమ్స్​ ఆడుతూ అప్పులు చేశాడు. అవి ఎలా తీర్చాలో తెలియక గత నెల 27న సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్​ చేసుకున్నాడు’’

హైదరాబాద్, వెలుగు నెట్వర్క్: ఈజీ మనీ కోసం కొందరు, సరదాగా ఆడటం మొదలెట్టి బానిసలుగా మారిన మరికొందరు.. ఆన్​లైన్​లో పెయిడ్​ గేమ్స్, బెట్టింగ్స్​తో యూత్​ బతుకులు ఆగం చేసుకుంటున్నారు. మెల్లమెల్లగా అప్పుల పాలై, తిరిగి కట్టలేక, ఇంట్లో వాళ్లకు చెప్పలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంకొందరైతే అప్పులు తీర్చేందుకు దొంగలుగా, చైన్​ స్నాచర్లుగా, సైబర్​ నేరగాళ్లుగా మారుతున్నరు. పైసల కోసం ఇంట్లో వాళ్లనూ చంపడానికి వెనుకాడట్లేదు. ఈ ఆన్​లైన్​ పెయిడ్​ గేమ్స్, బెట్టింగ్స్​ బారినపడి భవిష్యత్​ నాశనం చేసుకుంటున్నారు. ఇందులో 20 ఏండ్ల నుంచి 35 ఏండ్ల మధ్య వయసువారే ఎక్కువ ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది.

‘డబ్బులు సంపాదించడం ఎలా?’ అని ఇంటర్నెట్​లో ఒక్కసారి సెర్చ్  చేస్తే  లెక్కలేనన్ని ఆప్షన్స్  కనిపిస్తాయి. స్మార్ట్ ఫోన్ లో ఈజీ మనీ కోసం వెతికేవారికి ఆన్​లైన్​రమ్మీ అని, ఐపీఎల్ బెట్టింగ్ అని, ఫ్రీ మనీ ఎర్నింగ్ యాప్స్ అని ఎన్నో సైట్స్, యాప్స్ ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో చాలా మంది ఆన్​లైన్​ గేమ్స్​ను సరదాగా మొదలుపెట్టి.. చివరికి అడిక్ట్​అయ్యి, బయటపడలేక జీవితం కరాబ్​ చేసుకుంటున్నారు. కొందరికి అవి ఆన్​లైన్​ గేమ్స్​ అని, క్రికెట్ బెట్టింగులు అని తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటున్నారు. ఆన్​లైన్​లోనే అప్పులు సైతం దొరుకుతుండడం ఈ సమస్యను మరింతగా పెంచుతోంది. సిటీలు, టౌన్లలో ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్​ కోర్సులు చదివే స్టూడెంట్స్​తోపాటు రూరల్​ ఏరియాల్లోని నిరుద్యోగ యువకులు ఆన్​లైన్​ గేమ్​లకు అడిక్ట్ అవుతున్నారు.

లాక్​డౌన్​ టైం నుంచి మరింతగా..

లాక్ డౌన్ టైంలో చాలా మంది ఆన్​లైన్​ గేమ్స్ ఆడటంపై ఇంట్రెస్ట్​ చూపారు. క్రమంగా అవే గేమ్ లపై బెట్టింగ్​లు కాసే స్థాయికి అడిక్ట్​ అయ్యారు. డబ్బులు డిపాజిట్ చేసి గేమ్ ఆడితే సంపాదించవచ్చన్న ఆశలతో అప్పులు చేశారు. సాధారణంగా ఇలాంటి ఆన్​ లైన్​ పెయిడ్​ గేమ్స్, బెట్టింగ్​లను ఆర్గనైజ్​ చేసేవాళ్లు మొదట్లో కావాలనే కొంత డబ్బును యూజర్లు గెలుచుకునేలా చేస్తారు. దీంతో ఉత్సాహంగా మరింత సొమ్ము తెచ్చి గేమ్స్​ ఆడుతూ, బెట్టింగ్​ కడ్తుంటారు. డబ్బులు పోగొట్టుకున్నా మళ్లీ రాకపోతాయా అని ప్రయత్నిస్తుంటారు. ఇలా నిండా మునిగిపోతుంటారు. కొద్దిరోజులుగా రాష్ట్రంలో చాలా మంది యూత్​ ఇలాగే నష్టపోయారు.ఆన్​లైన్​ గేమింగ్ కంపెనీలు వివిధ రకాల యాప్ లు, వెబ్ సైట్ ల ద్వారా బిజినెస్ చేస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పేలలో కూడా గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. కొన్ని సంస్థలు క్విజ్ గేమ్స్ ద్వారా గేమర్స్ కి మనీ ఇస్తున్నాయి. ఆన్​లైన్​రమ్మీ వంటి గేమ్ లకు 50 రూపాయల నుంచి కూడా డబ్బు పెట్టి చాన్స్ ఉంటుంది. ముందు కొంత అమౌంట్ గేమ్ ఆడేవారి అకౌంట్లోకి వస్తుంది. దీంతోపాటు గేమ్ ల రివార్డ్స్​ ఇస్తూ ఆకర్షిస్తుంటారు.

కొడుకు చేసిన అప్పులకు తండ్రి బలి

సూర్యాపేట జిల్లా మోతె మండలం హుస్సేనాబాద్​కు చెందిన 24 ఏండ్ల అరె నవీన్ రెడ్డి ఆన్​లైన్ బెట్టింగ్ లో సుమారు రూ.కోటి వరకు పోగొట్టుకున్నాడు. ఆ అప్పులు తీర్చేందుకు అడ్డదారులు తొక్కాడు. తెలిసినవాళ్ల మొబైల్స్​ నుంచి సైబర్ క్రైమ్​లకు పాల్పడ్డాడు. పోలీసులు అతడిపై కేసు పెట్టారు. ఈ అవమానం భరించలేక నవీన్ రెడ్డి తండ్రి వెంకట్​రెడ్డి సూసైడ్​ చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులు భూములమ్మి అప్పులు తీర్చేసి.. ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయారు.

బెట్టింగుల అప్పులు తీర్చేందుకు చైన్ ​స్నాచింగ్..

గత నెల15న మహబూబ్​నగర్​ మెట్టుగడ్డ ప్రాంతంలో చెకింగ్​ చేస్తున్న పోలీసులకు బైకుపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉదయ్ కుమార్, విశాల్ కుమార్, గొల్ల గోపాల్ అనే ముగ్గురు యువకులు చిక్కారు. దర్యాప్తులో ఆ ముగ్గురూ క్రికెట్ బెట్టింగులకు అలవాటుపడి.. చైన్​స్నాచింగ్​లకు పాల్పడుతున్నట్టు తేలింది. పోలీసుల వారి నుంచి 13 తులాల బంగారు గొలుసులు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రాణాలు తీస్కుంటున్నరు

మెదక్ మండలం మక్తభూపతిపూర్ కు చెందిన జియ్యారి మహేశ్ (22) కు ఆరునెలల కిందే పెళ్లయింది. మొదట్లో ప్రైవేట్​ జాబ్​ చేసిన అతను.. తర్వాత ఖాళీగా ఉంటూ ఆన్​లైన్​ గేమ్స్​కు బానిసయ్యాడు. క్రికెట్​ బెట్టింగ్ లో లక్ష రూపాయలకుపైగా పోగొట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి తండ్రి మందలించడంతో గత నెల 9న చెరువులో దూకి సూసైడ్​ చేసుకున్నాడు.

మెదక్ జిల్లా నర్సాపూర్ కు చెందిన శ్రవణ్ కుమార్ (24) అనే యువకుడు క్రికెట్​ బెట్టింగ్​కు అలవాటుపడ్డాడు. ఆన్ లైన్​లో రూ. 60 వేలు లోన్​ తీసుకొని మరీ గేమ్​ ఆడాడు. డబ్బంతా పోవడంతో అప్పు కట్టలేకపోయాడు. కానీ అప్పు తీర్చాల్సిందేనంటూ సదరు ఆన్​లైన్​ కంపెనీ వాళ్ల నుంచి ఒత్తిడి పెరగడంతో.. విషయం ఇంట్లో తెలుస్తదని భయపడి ఉరివేసుకొన్నాడు.

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెలకు చెందిన తోట మధుకర్ (24) హైదరాబాద్ లో బీటెక్ ఫైనలియర్ చదువుతూ.. ఫ్రెండ్స్ ద్వారా ఆన్​లైన్​ గేమ్స్, బెట్టింగులకు అలవాటు పడ్డాడు. అప్పులు చేసి 5 నెలల్లో15 లక్షలు పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న తండ్రి ఆ అప్పులు చెల్లించేసినా.. తప్పుచేసిన భావనతో మధుకర్​ కుంగిపోయాడు. మనస్తాపంతో జూలై 7న పురుగుల మందుతాగాడు. నాలుగు రోజుల తర్వాత చనిపోయాడు.

కరీంనగర్​ కార్పొరేషన్​ పరిధిలోని కోతిరాంపూర్ కు చెందిన నితీశ్ (22) బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. లాక్ డౌన్ లో ఇంటి వద్దే ఉంటూ క్రికెట్​ బెట్టింగ్​కు అలవాటుపడ్డాడు. ఇంట్లో వాళ్లకు తెలియకుండానే లక్షల్లో అప్పులు చేసి డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో మసస్తాపం చెంది సెప్టెంబర్ 11న కాకతీయ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

పేరెంట్స్ముందే గుర్తించాలి

‘‘డ్రగ్స్, ఆల్కహాల్  లెక్కనే బెట్టింగ్​లకు యూత్ త్వరగా అడిక్ట్​అవుతారు. డబ్బులు ఒకసారి రాకపోయినా మరోసారైనా వస్తాయని అనుకుంటారు. అది సరికాదని చెప్పినా వినరు. అదో స్టేట్ ఆఫ్ మైండ్ కి వెళ్లిపోయి.. చివరికి యాంటీ సోషల్ పర్సనాలిటీగా మారుతున్నారు. దీన్ని బిహేవియరల్ అడిక్షన్  అంటారు. ఇలాంటి వాటిని పేరెంట్స్ ముందే గుర్తించాలి. సైకాలజిస్టులతో థెరపీ, మెడికేషన్ ఇప్పించాలి. గేమ్ కు బానిసైన వ్యక్తి కూడా అందులోంచి బయటికి రావాలని అనుకుంటే.. త్వరగా సమస్య తీరుతుంది. – డాక్టర్ హరిణి, సైకియాట్రిస్ట్, కేర్ హాస్పిటల్స్