హైదరాబాద్ లో సిలిండర్ పేలుడు.. భయాందోళనలో స్థానికులు

హైదరాబాద్ లో సిలిండర్ పేలుడు.. భయాందోళనలో స్థానికులు

రాజేంద్రనగర్ మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టే షన్ పరిధిలోని దుర్గానగర్ గ్యాస్ సిలెండర్ పేలింది.  అస్మతికుమారి అనే మహిళ వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంటి యజమానురాలు బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.పేలుడు ధాటికి ఇంటి గోడలు కూలిపోయాయి. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వంట గ్యాస్‌ వినియోగించడంలో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలపై అవగాహన లోపం,గ్యాస్‌ లీకేజీలపై ఏమరుపాటు కారణంగా భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రధాన ఆయిల్‌ కంపెనీలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేయడం, గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్లు అత్యవసర సేవల  నిమిత్తం  టెక్నికల్‌ సిబ్బందిని నియమించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఏజెన్సీల వద్ద గ్యాస్‌ లీకేజీ, ఇతరత్రా వినియోగదారుల కాల్స్‌ కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో పడిపోతున్నాయి.  డెలివరీ బాయ్స్‌ రిపేరు సిబ్బందిగా అవతారమెత్తి  ప్రైవేటు టెక్నీషియన్స్‌ కంటే అదనంగా సర్వీస్‌ చార్జీలు వసూలు చేయడం పరిపాటిగా తయారైంది. ఒకవైపు ఆయిల్‌ కంపెనీల నిర్లక్ష్యం, మరోవైపు వినియోగదారుల  తప్పిదాలు వంటింట్లో విస్ఫోటనాలకు దారి తీస్తున్నాయి.