ఇలాంటి అబ్బాయే కావాలి

ఇలాంటి అబ్బాయే కావాలి

ఈ కాలం అమ్మాయిలు ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తున్నారు. ఏ స్కూల్ అనే దాన్నుంచి మొదలుపెడితే.. ఏ కాలేజీలో చదవాలి?  ఏ గ్రూప్ తీసుకోవాలి? ఏ కోర్సు చదివితే ఏ ఉద్యోగం వస్తుంది? అని ముందే ప్లాన్ చేసుకుంటున్నారు. పది, పదిహేనేళ్లు తోడుండే ఉద్యోగం గురించే ఇంతలా ప్లాన్ చేసుకుంటే.. మరి జీవితాంతం తోడుండే లైఫ్ పార్ట్నర్ గురించి ఇంకెంత ఆలోచిస్తారు? లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎలా ప్లాన్ చేసుకుంటారు? అసలు ఎలాంటి అబ్బాయిలు తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారు? అబ్బాయిలూ.. అమ్మాయిలేం కోరుకుంటున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.

ఒకప్పుడు ఇంట్లో పెద్దలు ఓ అమ్మాయిని చూపించి.. ‘నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి రా’ అని చెప్తే.. తలూపి మూడు ముళ్లు వేసేవాళ్లు. ‘ఇదిగో.. అమ్మాయ్.. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో.. నీకు కాబోయే భర్త ఇతడే. రేపు పెళ్లయ్యాక ఏం చెప్పినా విను. ఎదురు మాట్లాడకు’ అంటూ చెప్పగానే.. ‘అలాగే.. మీరెలా చెప్తే అలా’ అంటూ పెద్దల మాటను పాటించేవారు. కానీ.. ఇప్పుడు కాలం మారింది. అందరూ మనసుకు ఏది నచ్చితే అదే చేస్తున్నారు. మునుపటి రోజుల్లోలాగ పెళ్లి విషయంలో పెద్దల మాట పాటిస్తారా? అంటే.. లేదనే చెప్పాలి. ఇప్పటి తరం చాలా అడ్వాన్స్ డ్ గా  ఉంది. కంప్యూటర్ ను చదివే మేధస్సుతో కంప్యూటర్ కే పాఠాలు చెప్తూ కొత్త ప్రపంచం వైపు అడుగులు వేయడం కాదు.. ఏకంగా పరుగులే తీస్తోంది. అందుకే.. తమ జీవితంలోకి రాబోయే పార్ట్నర్ ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేసుకుంటున్నారు. తమకు కావల్సిన క్వాలిటీలు ఆ అబ్బాయిలో ఉన్నాయో లేదో గమనించి మరీ అడుగు ముందుకేస్తున్నారు. మగవారితో సమానంగా పోటీపడి పలు రంగాల్లో రాణిస్తున్న అమ్మాయిలు తమ జీవితం ఎలా ఉండాలో? జీవితంలో ఎవరుండాలో.. ఎలాంటి వారుండాలో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు.

నిజాయితీగా ఉండాలి..

చాలామంది అబ్బాయిలకు పెళ్లికి ముందు ఓ లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ లో ఉన్న అమ్మాయే లైఫ్ పార్ట్నర్ అయితే సమస్య లేదు. కానీ..  అందరి విషయంలో అలా జరగదు కదా! అయితే.. అమ్మాయిలు మాత్రం ఈ విషయంలో చాలా కచ్చితత్వం కోరుకుంటారు. ఏ విషయమైనా నిజాయితీగా ఒప్పుకునే వారినే భాగస్వామిగా ఎంచుకుంటున్నారు. ఒక్కసారి నమ్మకం కోల్పోతే నిజాయితీ తప్పినట్టే. వారికి అనుమానం వస్తే జీవితాంతం ఆ ఫీలింగ్ వాళ్ల వెంటే ఉంటుంది.

అర్థం చేసుకోవాలి..

ఏ బంధమైనా పదికాలాల పాటు సంతోషంగా కంటిన్యూ కావాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అది ప్రేమైనా, స్నేహమైనా, బంధుత్వమైనా, భార్యాభర్తల బంధమైనా. ఒకరి మనసు ఒకరు, ఒకరి ఆలోచనలు ఒకరు, ఒకరి అభిరుచులు ఒకరు ఇలా అన్నీ విషయాల్లో పార్ట్నర్ని అర్థం చేసుకోగలగాలి. లేదంటే.. ఆ బంధం మధ్యలోనే తెగిపోతుంది. ప్రతీ చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయకుండా అర్థం చేసుకుని సర్దుకుపోవాలి.

రెండు కుటుంబాలతోనూ..

ఈ పోటీ జీవితాల్లో ఒక్క క్షణం పరుగు ఆపినా.. మిగతా వారి కంటే వెనుకబడిపోతాం. అందుకే.. పోటీ ప్రపంచంలో నిత్యం కెరీర్, సంపాదన, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అని పరుగులు తీస్తూనే ఉంటారు. అలాంటి వారితో జీవితం సాగించడం కాస్త కష్టమనే చెప్పాలి. ఎంత బిజీగా ఉన్నా.. ఇంట్లోవాళ్లతో, రెండువైపులా కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేయాలి. అప్పుడే అటు అమ్మానాన్నలు, అత్తమామలు ఇద్దరూ ఒక్కటే అన్న భావన కలుగుతుంది. కుటుంబ సభ్యులతో గడిపిన క్షణాలే జీవితంలో చాలాకాలం వరకు గుర్తుండిపోతాయి. కొంతకాలం తర్వాత అవే తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అందుకే.. ఇంట్లోవాళ్లకు టైమ్ ఇచ్చే వారికే తమ తొలి ఓటు అంటున్నారు అమ్మాయిలు.

కష్టాన్ని భరించాలి..

‘ఎంతటి కష్టమొచ్చినా.. ఇదెంత’ అనే అబ్బాయిలనే అమ్మాయిలు ఏరి కోరి మనువాడుతున్నారట. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ‘ఈ రోజు సుఖంగా సాగిపోతున్న బతుకు బండి ఉన్నట్టుండి కష్టాల సుడిగుండంలో పడిపోవచ్చు. దాన్ని భరించే శక్తి లేకపోతే ఎలా? కుటుంబ పెద్దగా, అన్నీ చూసుకోవాల్సింది అతడేగా.. కష్టాన్ని భరించగలిగిన వారికే మా ఓటు’ అంటున్నారు అమ్మాయిలు. అందుకే.. కష్టమొచ్చినప్పుడు కుంగిపోకుండా.. ‘కష్టేఫలి’ అనే సూత్రాన్ని నమ్మి ముందుకు సాగిపోవాలి.

వంట తెలిసుండాలి..

లాస్ట్.. బట్ నాట్ లిస్ట్.. ఎన్ని విద్యలొచ్చినా.. ఎంత మేధావి అయినా.. కనీసం నాలుగైదు వంటలైనా వచ్చి ఉండాలనేది నాటి నుంచి అమ్మాయిలు పెట్టే ముఖ్యమైన డిమాండ్. ఎందుకంటే ఆమెకు ఆరోగ్యం బాగలేనప్పుడో, రెగ్యులర్గా వండిన వంటలు బోర్ కొట్టినప్పుడో.. ఏదైనా కొత్త వంటకం తినాలనిపిస్తే.. భర్త గరిటె పట్టాల్సిందే. అలా కాకుండా.. భార్య ఎప్పుడైనా నాలుగైదు రోజులు ఊరెళ్తే హోటల్లో తినే బదులు ఇంట్లో వండుకుని తింటే.. అటు డబ్బు మిగులుతుంది.. ఇటు ఆరోగ్యం పాడవకుండా ఉంటుందనేది వారి కాన్సెప్ట్. అందుకే.. అబ్బాయిలూ.. వంటింట్లో గరిట తిప్పడం నేర్చుకోండి. అది వాళ్లకే కాదు.. మీక్కూడా ఉపయోగపడుతుంది.

నవ్వుతూ.. నవ్విస్తూ ఉండాలి..

‘నలుగురిలో నిన్ను ప్రత్యేకంగా కనిపించేలా చేసేది నీ చిరునవ్వే’ అన్నాడో కవి. అవును మరి.. ఎవరైనా నవ్వుతూ పలకరించేవారితోనే మాట్లాడుతారు. వారితో స్నేహం చేయాలని చూస్తారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారిని చూస్తే.. మనసులోని నెగెటివ్ థింకింగ్ హుష్కాకి అవుతుందట. అందుకే.. ఎప్పుడూ నవ్వుతూ, ఇతరులని నవ్వించే వారినే జీవితంలోకి ఆహ్వానించడానికి మొగ్గు చూపుతున్నారు అమ్మాయిలు.