బ్రిజ్ భూషణ్కు బీజేపీ షాక్ : తండ్రికి బిస్కెట్.. కొడుక్కి టికెట్!

బ్రిజ్ భూషణ్కు  బీజేపీ  షాక్ :  తండ్రికి బిస్కెట్.. కొడుక్కి టికెట్!

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కైసర్‌గంజ్ సిట్టింగ్  ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు బీజేపీ షాక్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.  ఆయనకు ఈ సారి అధిష్టానం టికెట్ కేటాయించే ఆలోచనలో లేదట. ఆయన స్థానంలో  ఆయన చిన్న కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌కు టికెట్ ఇచ్చి బరిలోకి దింపాలని భావిస్తోందట కైసర్‌గంజ్ స్థానానికి బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టింది.  ఈ స్థానానికి మే 20న ఐదో దశ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ జరగనుంది.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు  బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక దాడులు చేశారని భారత రెజ్లర్లు రోడ్లపైకి వచ్చి తీవ్ర ఆందోళన చేపట్టారు. అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. వీరి నిరసనలు తీవ్రతరం కావడంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌ భూషణ్‌పై జూన్‌ 2023లో కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో ఆయనకు జూలై 20న బెయిల్‌ లభించింది. ప్రస్తుతం అతనిపై వచ్చిన అభియోగాలపై ఢిల్లీ కోర్టులో విచారణ కొనసాగుతన్న విషయం తెలిసిందే.

Also Read: అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో.. ముగ్గురు కాంగ్రెస్ నేతలు అరెస్ట్

కరణ్ భూషణ్ సింగ్  బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు చిన్న కుమారుడు .1990, డిసెంబర్ 13న  జన్మించారు. ఈయనకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అతను డబుల్ ట్రాప్ షూటింగ్‌లో జాతీయ క్రీడాకారుడు.  కరణ్ భూషణ్ సింగ్ విదేశాల్లో చదువుకున్నాడు. ఆస్ట్రేలియాలో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివాడు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. కరణ్ భూషణ్  రేపు అంటే మే 3వ తేదీన కైసర్‌గంజ్ నుంచి నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఆయనకు ఇదే తొలి ఎన్నిక అవుతుంది.  కరణ్ భూషణ్ అన్నయ్య ప్రతీక్ భూషణ్ సింగ్ ప్రస్తుతం బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.