లోకల్ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇయ్యాలె : కోదండరాం

లోకల్ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇయ్యాలె : కోదండరాం

8 ఏళ్లైనా అమరవీరుల స్పృతి చిహ్నం పూర్తికాలేదని టీజేఎస్ ప్రెసిడెంట్ కోదండరాం ఆరోపించారు. కానీ సచివాలయం పనులు జోరుగా నడుస్తున్నాయన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత అనుకుంది. కానీ  ఉద్యోగాల భర్తీ కావడం లేదని చెప్పారు. పుస్తకాలతో విద్యార్థులు కుస్తీలు పడ్తున్నారన్న కోదండరాం... రాష్ట్రం వచ్చాక ఉద్యోగాలు రాక మళ్లీ నిరుద్యోగులు చనిపోతున్నారని తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న ఓ యువకుడు ఉద్యోగం రాక ఐస్ క్రీమ్ అమ్ముకుంటుండన్నారు. చాలామంది యువత ఉపాధి హామీ పనులకు, కూలీ పనులకు పోతున్నరని చెప్పారు. చదువుకున్న విద్యార్థులు నౌకరి రాక ఇంటికి పోతలేరన్నారు. ఇంటికి పోతే ఇజ్జత్ పోతదని భయపడ్తున్నారని చెప్పారు. 8ఏళ్లుగా నిరుద్యోగులు ఉద్యోగం రాక ఇతర పనులకు పోతున్నారన్న ఆయన... దీని ద్వారా ఉద్యోగం కోసం ఆశించే వారి సంఖ్య తగ్గిందని, దీన్నే సర్కార్ చూపిస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొందని కోదండరాం అన్నారు. బతుకు దెరువు కోసం కాదని, సామాజిక మార్పుకోసం ఉద్యోగం అవసరమని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగావున్న 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసి లెక్కచూపడం సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణా వచ్చాక ఉద్యోగాలభర్తీలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆయన.. ఎగ్జామ్ పేపర్లో ప్రతీ సారి తప్పులు దొర్లుతున్నాయని చెప్పారు. గ్రూప్ -1 లో పోలీస్ ఉద్యోగాల భర్తీలో తప్పులిచ్చారని, టీఎస్పీఎస్సీలో తప్పులు దొర్లకుండా పేపర్ తయారుచేయడానికి తాను తన పెన్షన్ డబ్బులనుండి రూ.10వేలు ఇస్తానని స్పష్టం చేశారు. 8ఏళ్లుగా 50-60 వేల ఉద్యోగాల భర్తీ చేశారన్న కోదండరాం... ప్రైవేట్ కంపెనీల్లో లోకల్ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.