హెల్దీ లైఫ్ స్టైల్​తో రక్తపోటుకు చెక్

హెల్దీ లైఫ్ స్టైల్​తో రక్తపోటుకు చెక్

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యకరమైన జీవన శైలి, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా రక్తపోటు(హైపర్ టెన్షన్)ను నివారించవచ్చని గవర్నర్ తమిళిసై అన్నారు. తప్పుడు పనుల వల్ల ప్రజల్లో రక్తపోటు సమస్య పెరుగుతోందన్నారు. హైపర్ టెన్షన్ కంట్రోల్ లో లేకపోతే గుండె పోటు, కిడ్నీ సంబంధిత జబ్బులు వస్తాయన్నారు. ఆదివారం ఇండియన్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ వెబినార్​లో గవర్నర్ మాట్లాడారు. దేశంలో 29 శాతం మంది జనం రక్తపోటుతో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం యోగా చేయాలని, ఉప్పు వాడకం తగ్గిస్తే సమస్యను నివారించే చాన్స్ ఉందని అన్నారు. కాగా, గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అమ్మవారికి బోనాలు సమర్పించే సమయంలో కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని భక్తులకు సూచించారు. మహంకాళి తల్లి ఆశీస్సులతో కరోనా సంక్షోభాన్ని అధిగమించాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆశీస్సులు అందించాలని అమ్మవారిని ప్రార్థించారు.