బామ్మ చేతి వంట

బామ్మ చేతి వంట

సక్సెస్​కు వయసుతో పనిలేదు. క్రియేటివిటీ ఉంటే చాలు.. అని నిరూపించింది ఈ 66 ఏండ్ల కేరళ బామ్మ ఓమన. విలేజ్​ స్టైల్​లో వంటలు చేస్తూ ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది.  ఆమె చేసే కేరళ ట్రెడిషనల్​ వంటలు ‘‘విలేజ్​ కుకింగ్​‌‌‌‌– కేరళ”ఛానెల్​లో అప్​లోడ్​ చేస్తుంటారు. అంతేకాదు.. వంట కోసం కట్టెల పొయ్యి, మట్టి కుండలు, గ్రైండింగ్​ కోసం రాళ్లు వాడుతుంది. అందుకే చాలామంది ఎత్నిక్​ కేరళ ఫుడ్​ కోసం ఈ ఛానెల్​ని చూస్తున్నారు.  

ఓమన అమ్మ వంటలకు ఫాలోయింగ్​ చాలా ఉంటుంది. ఆమె చేసిన ఎన్నో వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. కేరళ ట్రెడిషనల్​ వంటలు చేయడంలో చేయి తిరిగిన ఆమెకు ట్రెడిషనల్​గా వండడం వల్ల ఎంతో ఫేమ్​ వచ్చింది. ఆమె సొంతూరు కేరళలోని పథనంతిట్ట. ఓమన అమ్మ వీడియోల్ని అప్​లోడ్​ చేస్తున్న ఛానెల్​ని అదే ఊరికి చెందిన ఆమె బంధువులు అమ్జిత్, అభిజిత్ పెట్టారు. కుకింగ్ వీడియోలను విలేజ్ కుకింగ్స్ అనే ఫేస్‌‌‌‌బుక్ పేజీలో పోస్ట్​ చేసేవాళ్లు. కానీ.. అప్పుడు అంతగా వ్యూస్​ రాలేదు. కొన్నాళ్లకు ఓమన వాళ్ల టీమ్​లో చేరింది. అప్పటినుంచి వెనక్కితిరిగి చూసుకోలేదు. తర్వాత 2018లో యూట్యూబ్​ ఛానెల్​ మొదలుపెట్టారు. ఫేస్​బుక్​, యూట్యూబ్​లో అప్​లోడ్​ చేసే అన్ని వీడియోలకు బాగానే వ్యూస్​ వచ్చాయి.  ప్రస్తుతం యూట్యూబ్‌‌‌‌లో 13.7 లక్షల మంది సబ్‌‌‌‌స్క్రయిబర్లు ఉన్నారు. ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో 30 లక్షల మంది ఫాలోవర్స్​ ఉన్నారు. 

ఎప్పుడూ సీరియస్​గా.. 

ఓమన వీడియోల్లో ఎక్కువగా సీరియస్​గానే కనిపిస్తుంటుంది. అలా ఎందుకు అని అడిగితే.. ‘‘నేను పనిచేస్తున్నప్పుడు పని మాత్రమే చేస్తాను. పని చేస్తూ నవ్వడం నాకు ఇష్టం ఉండదు”అని నవ్వుతూ చెప్తుంది. అంతేకాదు.. ఆమె వీడియోలు వైరల్​ అవ్వడంతో చాలా ఫేమస్​ అయింది కూడా. అందుకే ఆమె బయటికి వెళ్లినప్పుడు ఆమె దగ్గరికి చాలామంది వచ్చి ఫొటోలు తీసుకుంటుంటారు. 

వీడియోల్లో ట్రెడిషన్​

కేరళలోని రన్ని అనే టౌన్​కి  సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోతుపర అనే గ్రామీణ ప్రాంతంలో వీళ్లు వీడియోలు తీస్తుంటారు. వీడియోలకు లక్షల వ్యూస్​ రావడానికి ఈ లొకేషన్​ కూడా ఒక కారణం. పచ్చదనం, విలేజ్​ లైఫ్​, పెద్ద పెద్ద చెట్లు, జంతువులు.. ఇలా అన్నింటినీ వీడియోల్లో చూపిస్తుంటారు. కేరళ ట్రెడిషనల్​ దుస్తుల్లో వీడియోలు చేస్తుంది ఓమన. లుంగీ, జాకెట్టు, థోర్తు (టవల్) కట్టుకుని కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటుంది. “కేరళ ఫుడ్​ కల్చర్​ చూపించే ఛానెళ్లు చాలానే ఉన్నాయి. అందుకే మేం కాస్త స్పెషల్​గా ఉండాలనే ఉద్దేశంతోనే  ఓమన అమ్మతో చేయిస్తున్నాం” అంటాడు ఛానెల్​ ఫౌండర్స్​లో ఒకరైన అమ్జిత్​.  

స్టాండ్ అవుట్ హోస్ట్

ఛానెల్ పెట్టిన కొత్తలో ఓమన వీడియోలు చేయడానికి చాలా తడబడింది. కెమెరా ముందు వంట చేయలేకపోయింది. కానీ.. కొన్ని రోజులకు గాడిలోకి వచ్చింది. “ఓమన అమ్మ కెమెరాను చూసి నవ్వుతూ.. ప్రతి విషయాన్ని వివరంగా చెప్పే మామూలు హోస్ట్ కాదు. ఆమె కెమెరా గురించి పెద్దగా పట్టించుకోదు. తన పని తాను చేసుకుంటూ పోతుంది”అని అమ్జిత్​ చెప్పాడు. అలా ఉన్నందుకే ఆమె ఎంతోమంది  అభిమానులను సంపాదించుకుంది. 

24 ఏండ్ల నాటి కత్తి

ఓమన వంట చేయడానికి అలా సంప్రదాయ పనిముట్లే వాడుతుంది. కూరగాయలు కోయడానికి వాడుతున్న కత్తి 24 ఏండ్ల నాటిది. అప్పట్లో దాన్ని ఒక సంతలో కొన్నదట. దాన్ని ఆమె ఒక ఆర్టిస్ట్​ ఇన్​స్ట్రుమెంట్​ని ఎంత  జాగ్రత్తగా చూసుకుంటారో.. అలా వాడుతుంది. చాలా స్పీడ్​గా కూరగాయలు కోస్తుంది. గ్రైండింగ్​ కోసం ఆమె ఇప్పటికీ రాళ్లనే వాడుతుంది. ట్రెడిషనల్​ గ్రైండింగ్​ రాళ్లు (అమ్మికల్లు, అరకల్లు, ఉరల్ లాంటివి) అన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 550 వీడియోలు చేసింది. వాటిలో శ్నాక్స్​, వెజ్​,  నాన్​వెజ్, ఊరగాయలు, పాయసాలు.. లాంటి అనేక మలయాళీ వంటకాలు ఉన్నాయి. చమ్మంటిపొడి (కాల్చిన కొబ్బరి చట్నీ పొడి) లాంటి వీడియోలకు మిలియన్లలో వ్యూస్​ వచ్చాయి