టైట్​ జీన్స్​తో లంగ్స్​కు డేంజర్

టైట్​ జీన్స్​తో  లంగ్స్​కు డేంజర్

జీన్స్.. నేటి తరం ఎక్కువగా తొడుగుతున్నది వీటినే. ఫ్యాషన్​ ప్రపంచంలో తమను తాము సరికొత్తగా చూపించుకోవాలనుకుంటుంది యూత్. కానీ, ఆ జీన్స్​ ఫ్యాషనే లేనిపోని అనారోగ్యాలకు కారణమవుతోందని తెలుసా? లంగ్స్​లో రక్తం గడ్డలు కడుతోందని తెలుసా? ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి అదే సమస్య ఎదురైంది. కొద్ది రోజుల క్రితం ఫ్రెండ్స్​తో కలిసి కారులో రుషికేశ్​ ట్రిప్పుకు వెళ్లాడు సౌరభ్​ శర్మ అనే యువకుడు. వెళుతున్నప్పుడు ఫ్యాషన్​గా ఉండే టైట్​ జీన్స్​ను వేసుకున్నాడు. కానీ, కొంత దూరం వెళ్లాడో లేదో, అతడి కాళ్లు మొద్దెక్కడం మొదలుపెట్టాయి. కదపలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కువగా కూర్చోవడం వల్ల అయి ఉండొచ్చులే అనుకున్నాడు. కానీ, రెండు రోజుల తర్వాత ట్రిప్పు ముగించుకుని ఆఫీసుకెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

ఏం జరుగుతోందో తెలియని తోటి ఉద్యోగులు వెంటనే గురుగ్రామ్​లోని పరాస్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అప్పటికే అతడు ఏ కదలికల్లేకుండా పడి ఉండడంతో డాక్టర్లు సీపీఆర్​ చేసి బతికించారు. అన్ని స్కాన్లు తీసి చూస్తే లంగ్స్​కు బ్లడ్​ను పంప్​ చేసే పల్మొనరీ ఆర్టరీల్లో క్లాట్​ ఉన్నట్టు గుర్తించారు. దానికి కారణం అతడు వేసుకున్న టైట్​ జీన్సే అని తేల్చి చెప్పారు. ‘‘కాళ్లు కదపడానికి, గుండెకు రక్తం చేరడానికి ఒంట్లోని తొడ కండరాలు కీలకం. డీఆక్సిజనేటెడ్​ బ్లడ్​ శుద్ధి కోసం ఊపిరితిత్తులకు పల్మొనరీ ఆర్టరీల ద్వారా రక్తం వెళుతుంది. ఆ ఆర్టరీలు సాఫీగా పనిచేయాలంటే తొడ కండరాలూ ఫ్లెక్సిబుల్​గా ఉండాలి. టైట్​బట్టలు వేసుకోవడం వల్ల ఆ కండరాలు సరిగ్గా కదలక ఆర్టరీల్లో క్లాట్​లు ఏర్పడతాయి. రక్తం ఎక్కడికక్కడ పేరుకుపోతుంది. అది డీప్​ వెయిన్​ థ్రాంబోసిస్​కు దారి తీస్తుంది. దాని వల్ల పల్మొనరీ ఎంబోలిజం వస్తుంది. అంటే ఊపిరితిత్తుల్లోని నాళాల్లో రక్తం గడ్డకడుతుంది” అని పరాస్​ హాస్పిటల్​ డాక్టర్​ వెంకట క్రిష్ణన్​ తెలిపారు. సౌరభ్​ శర్మకు అదే పరిస్థితి తలెత్తిందన్నారు. సౌరభ్ విషయంలో ఆ పల్మొనరీ ఆర్టరీ సన్నగా మారిందని చెప్పారు. దానికి కారణం టైట్ జీన్స్​ అని చెప్పలేమని మరో డాక్టర్​ మంజీతా నాథ్​ దాస్​ చెప్పారు. మన, లైఫ్​స్టైల్​ కూడా అందుకు కారణమవుతుందన్నారు.