ఫ్రీ ట్రీట్ మెంట్ చేయ‌కుంటే.. భూములు వెనక్కి తీసుకోండి

ఫ్రీ ట్రీట్ మెంట్ చేయ‌కుంటే.. భూములు వెనక్కి తీసుకోండి

షరతులు పాటించనప్పుడు ప్రైవేటు హాస్పిటల్స్ కు రాయితీలెందుకు?
సర్కార్ ను ప్రశ్నించిన హైకోర్టు
కరోనా టైంలో కాసుల కక్కుర్తా?
కాటికిపోయే మృతదేహాలను దగ్గర పెట్టుకుంటరా?
అపోలో, బసవతారకం హాస్పిటల్స్ పై పిల్‌

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు మండిపడింది. కరోనా పేషెంట్ల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తుంటే సర్కారు పట్టించు కోకపోతే ఎలా? అని ప్రశ్నిం చింది. రాయితీలతో భూముల్ని పొందిన ఆస్పత్రులు కరోనా పేషెంట్ల నుంచి అధికంగా ఫీజులు గుంజుతుంటే ఆ భూముల్ని ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదో చెప్పాలని అడిగింది. పేదలకు ఫ్రీ ట్రీట్ మెంట్ అందిస్తామనే షరతుతో ప్రభుత్వం నుంచి భూములు పొందిన జూబ్లీ హిల్స్‌‌లోని అపోలో హెల్త్‌‌సిటీ ఆస్పత్రి, బసవతారకం ఇండో అమెరికన్ ‌‌క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్ ‌‌ఇన్‌‌స్టిట్యూట్‌‌ల్లో కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూళ్లు చేయడాన్ని తప్పు పడుతూ సోషల్‌ వర్కర్‌ ఓ.ఎం. దేబరా దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు బుధవారం విచారించింది. షరతులను పాటించని ఆస్పత్రులకు రాయితీలపై ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకునే విషయంలో ప్రభుత్వ వైఖరి చెప్పాలని చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్‌చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్ ‌‌రెడ్డితో కూడిన డివిజన్ ‌‌బెంచ్ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.

రోజుకు లక్ష వసూలు చేస్తున్నరు…

1981లో అపోలో ఆస్పత్రి (డెక్కన్‌ హాస్పిటల్స్ ‌‌కార్పొరేషన్ ‌‌లిమిటెడ్‌)కు 30 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందని, 1989లో బసవ తారకం ఆస్పత్రికి 7.35 ఎకరాలను 30 ఏండ్లకు లీజుకు ఇస్తూ తిరిగి లీజు పొడిగించే షరతుపై ప్రభుత్వం ఇచ్చిందని పిటిషనర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌‌రావు వాదించారు. యూఎల్‌సీ రూల్స్‌ అమలు నుంచి మినహాయింపు ఇచ్చి అపోలోకు 30 ఎకరాలను ఇచ్చిన భూముల విలువ రూ.1500 కోట్లకు పైగానే ఉంటుందని, బసవ తారకం ఆస్పత్రికి ఇచ్చిన భూముల విలువ రూ.400 కోట్లుఉంటుందని చెప్పారు. అపోలోలో 15 శాతం, బసవ తారకంలో 25 శాతం బెడ్స్‌‌ పేదలకు ఉచితంగా ఇవ్వాలని, ఔట్‌ పేషెంట్లకు 40 శాతం ఉచితంగా ట్రీట్ మెంట్ అందించాలన్నారు. అపోలో ఆస్పత్రిలో కరోనా ట్రీట్ మెంట్ కు గవర్నమెంట్‌ పర్మిషన్ ఇచ్చిందని, రోజుకు రూ.లక్ష వరకూ వసూలు చేస్తోందని, భూమి తీసుకున్నప్పుడు అంగీకరించిన షరతులు అమలు చేయడం లేదని పేర్కొన్నారు.

50 శాతం బెడ్స్‌‌ కరోనా ట్రీట్మెంట్ కు కేటాయించేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. పేదలకు ఫ్రీ ట్రీట్మెంట్ అందించాలన్న షరతులతో కారు చౌకగా కోట్ల విలువైన భూములు తీసుకుని పేదల నుంచి కూడా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. వాదనల అనంతరం హైకోర్టు, ఇప్పటికే కరోనాపై దాఖలైన పిల్స్‌‌తో కలిపి ఈ పిల్‌ను కూడా ఈ నెల 13న విచారిస్తామని తెలిపింది.

సర్కార్ ఏం చేస్తదో చెప్పాలి..

కరోనా కష్టకాలంలో కూడా కనికరం లేకుండా కాసుల కోసం కక్కుర్తి పడుతున్న కార్పొరేట్‌ ఆస్పత్రులపై కొరడా ఝుళిపించేందుకు ఏమాత్రం వెనకాడకూడదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పేదలకు కొంత శాతం ఫ్రీ ట్రీట్ మెంట్ అందిస్తామనే షరతును పాటించని ఆస్పత్రులకు ఇచ్చిన భూముల్ని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోరాదో చెప్పాలని ప్రశ్నించింది. ‘‘డబ్బులిస్తే తప్ప మృతదేహాన్ని ఇవ్వడంలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కరోనా కష్టకాలంలో కనికరం లేకుండా కాసుల కోసం.. కాటికిపోయే మృతదేహాల్ని కూడా పెట్టుకుంటారా? ఎంత దారుణం. ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వకపోగా గవర్నమెంట్ జీవోతో సంబంధం లేకుండా కరోనా ట్రీట్ మెంట్ కు ఫీజులు వసూలు చేయడం దారుణం. ఇలాంటి వాటిపై సర్కారు చర్యలు తీసుకోవాలి. లేదంటే రాయితీలను రద్దు చేయాలి. షరతుల మేరకు భూముల్నివెనక్కి తీసుకోవాలి. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి” అని కోర్టు ఆదేశించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం