హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నజ్వర బాధితులు

హాస్పిటల్స్ కు  క్యూ కడుతున్నజ్వర బాధితులు

వాతావరణంలో మార్పుల కారణంగా రోగాలు ప్రబలుతున్నాయి. జర్వం, జలుబు, గొంతునొప్పి, దగ్గు, వాంతులు, విరేచనాలతో జనం హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. ఏ హాస్పిటల్ చూసినా వైరల్ ఫీవర్ బాధితులతో కిక్కిరిసిపోతోంది. ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా వైరల్ ఫీవర్ బాధితులుంటున్నారు. వర్షాకాలం.. కొన్ని రోజులుగా వాతావరణం ముసురుగా ఉండటంతో విషజ్వరాల సంఖ్య పెరిగిపోయింది.  పది రోజులుగా పలు రకాల జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఒక్క ఫీవర్ హాస్పిటల్ లోనే రోజుకు 700 నుంచి 900 ఓపీ ఉంటోంది. సాధారణ రోజుల్లో ఇక్కడ 3 నుంచి 4 వందల మంది మాత్రమే వస్తుంటారు.  సీజన్​మార్పుల  కారణంగా ఈ సంఖ్య డబుల్ అయ్యింది. ఇక ఇన్ పేషెంట్ గా చేరుతున్న వారి సంఖ్య రోజుకు 30 నుంచి 40 వరకు ఉంటోంది. వీరిలో ఎక్కువగా హెపటైటిస్, విషజర్వాల బాధితులు ఉంటున్నారు. ఒక్క ఫీవర్ హాస్పిటల్ లో మాత్రమే కాదు ఉస్మానియా, గాంధీ, నీలోఫర్  హాస్పిటల్స్ లో కూడా వైరల్ ఫీవర్స్ బాధితుల సంఖ్య పెరిగింది. ప్రతి హాస్పిటల్ రోజు ఉండే సాధారణ ఓపీ కన్నా 500 వందల మంది వరకు ఎక్కువ ఓపీ ఉంటోంది. పెరిగిన ఓపీ మొత్తం కూడా వైరల్ ఫీవర్స్ బాధితులేనని వైద్యులు చెబుతున్నారు.

ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ జ్వరాల బాధితులే

ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ మాత్రమే కాదు పీహెచ్ సీలు, బస్తీ దవాఖానాలతో పాటు ప్రైవేట్ క్లినిక్ లు, నర్సింగ్ హోమ్ ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ కు వచ్చే వారి కన్నా ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు, గర్భిణులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నీలోఫర్ హాస్పిటల్ లో 600 వరకే ఉండే ఓపీ కాస్త ఇప్పుడు వెయ్యికి చేరింది. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, క్లినిక్స్ లో ఓపీ లు కిటికిటలాడుతున్నాయి.

మందుల కొరత, సిబ్బంది లేమి

ఫీవర్​ హాస్పిటల్ కు వస్తున్న రోగులకు సరిపడా సిబ్బంది లేకపోవటం ఇబ్బందిగా మారుతోంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్, పీహెచ్ సీలలో సిబ్బంది కొరత ఉంది.  ఫీవర్ హాస్పిటల్ లో  వందలాది మంది రోగులకు ఉన్న డాక్టర్ల సంఖ్య 15 మాత్రమే. దీంతో రోగుల కోసం కనీసం 15 నిమిషాలు కూడా సమయం ఇవ్వలేని పరిస్థితి. అసలే రోగాలతో బాధపడుతున్న వారంతా గంటల తరబడి ఓపీ లైన్ల వద్ద నిలుచోవాల్సి రావటంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మందుల కొరత కూడా ఉంది. దీంతో చాలా మంది ప్రభుత్వ హాస్పిటల్ లో ఓపీ చూయించుకొని ప్రైవేట్ మెడికల్ షాప్ లో  మందులు కొనుగోలు చేస్తున్నారు.

వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలేవి?

వర్షాకాలం వచ్చిందంటే ముఖ్యంగా నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం సాధారణంగా జరిగేదే. ఇక దోమలు సైతం వర్షాకాలం విజృంభిస్తుంటాయి. ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ ఈ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వ్యాధులు ప్రబలే ఏరియాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అవగాహన కల్పించాల్సి ఉంది. మలేరియా నివారించేందుకు ఫాగింగ్ చేపట్టాల్సిన బల్దియా కూడా లేటుగా మేల్కొంది. దీంతో గత నెలలో దాదాపు 150 కి పైగా మలేరియా కేసులు నమోదయ్యాయి. వారం రోజుల క్రితమే అసిఫ్ నగర్  లో మైనారిటీ స్కూల్లో కలుషిత నీరు, ఆహారం తిని 33 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.