స్విస్​ బ్యాంకుల్లో మనోళ్ల డబ్బు మస్తు పెరిగింది

స్విస్​ బ్యాంకుల్లో మనోళ్ల డబ్బు మస్తు పెరిగింది

న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయ వ్యక్తులు,  సంస్థల  నిధులు 2021లో 14 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరాయి. వీటి విలువ 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌‌‌‌‌‌‌‌‌‌లకు (రూ.30,500 కోట్లకు పైగా) పెరిగింది. సెక్యూరిటీలు, డిపాజిట్ల ద్వారా ఈ బ్యాంకుల్లో డబ్బును మదుపు చేశారు. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ (ఎస్​ఎన్​బీ) రిపోర్టు ఈ విషయాలను వెల్లడించింది. 2020 చివరి నాటికి  స్విస్ బ్యాంకుల్లోని భారతీయ ఖాతాదారుల సంపద 2.55 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌‌‌‌లకు (రూ.20,700 కోట్లు) చేరింది. భారతీయ కస్టమర్ల సేవింగ్స్/ డిపాజిట్ ఖాతాల్లో ఉన్న డబ్బు ఏడేళ్ల గరిష్ట స్థాయి రూ.4,800 కోట్లకు పెరిగింది.   2006లో రికార్డు స్థాయిలో భారతీయుల ఖాతాల నుంచి దాదాపు 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌‌‌‌లు జమ అయ్యాయి. ఆ తర్వాత ఇది 2011, 2013, 2017, 2020లో మినహా చాలా వరకు డిపాజిట్లు తక్కువగానే ఉన్నాయి. 2021లో మాత్రం అన్ని రకాల డిపాజిట్లు పెరిగాయి. ఈ లెక్కల్లో భారతీయులు, ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ఐలు లేదా ఇతరులు థర్డ్ కంట్రీ ఎంటిటీల పేర్లతో స్విస్ బ్యాంకుల్లో ఉన్న డబ్బును చేర్చలేదు. ఈ వివరాలు బ్యాంకులు ఎస్ఎన్​బీకి ఇచ్చిన డేటా మాత్రమే. ఇదంతా నల్లధనమనే ప్రచారం నిజం కాదని స్విస్​ బ్యాంకులు చెబుతున్నాయి. ఇండియా–స్విట్జర్లాండ్​ దేశాల మధ్య ఒప్పందం ప్రకారం డిపాజిట్లకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు.