
ఇండియా తొలిసారి మనిషిని అంతరిక్షంలోకి పంపుతున్న ‘గగన్ యాన్’కు ఆస్ట్రోనాట్ల ఎంపికపై మన ఎయిర్‌ఫోర్స్ కసరత్తు మొదలుపెట్టింది. కఠినమైన మిషన్‌ను సాధించగల 10 మంది పైలట్లు, ఫ్లైట్ ఇంజనీర్లు కోసం అన్వేషిస్తోంది. వీళ్లలో ముగ్గురు కేండిడేట్లను ఆస్ట్రోనాట్లుగా తయారు చేస్తారు. ఈ టీమ్‌లో ఒక మహిళా ఆస్ట్రోనాట్ ఉండేలా చూస్తారు. ఐఏఎఫ్ ఎంపిక చేసే 10 మందికి బెంగుళూరులోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్(ఐఏఎమ్) మెడికల్ టెస్టులు నిర్వహిస్తుంది. వాలంటరీగా ముందుకు వచ్చే పైలట్లు లేదా ఫ్లైట్ ఇంజనీర్లను కూడా ఐఏఎఫ్ ఈ మిషన్ కోసం ఎంపిక చేస్తుందని తెలిసింది. వీళ్లతో పాటు ఐఏఎఫ్ ఎంపిక చేసిన వారిని కలిపి మూడు రౌండ్ల పాటు అతి కఠినమైన మెడికల్ టెస్టులను ఐఏఎమ్ నిర్వహిస్తుంది. ముఖ్యంగా కేండిడేట్ల సైకాలజీని పరీక్షించేలా టెస్టులు ఉంటాయని సమాచారం. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది? ఇప్పటిదాకా ఐఏఎఫ్ ఎంతమందిని ఐఏఎఫ్ షార్ట్ లిస్ట్ చేసిందన్న వివరాలు తెలియరాలేదు. ఐఏఎమ్ టెస్టుల్లో పాసై, గగన్ యాన్ మిషన్ కు ఎంపికయ్యే వారికి తొలుత ఇండియాలో ట్రైనింగ్ ఇస్తారు. తర్వాతి ట్రైనింగ్ కోసం విదేశాలకు పంపుతారు. ప్రస్తుతం అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌తో సెకండ్ ఫేజ్ ట్రైనింగ్ గురించి ఇండియా చర్చలు జరుపుతోంది. తర్వాత వారిని స్పేస్‌లోకి పంపుతారు.