మణిపూర్ రాజధానిలో ఐఈడీ పేలుడు..వీడియో

మణిపూర్ రాజధానిలో ఐఈడీ పేలుడు..వీడియో

మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో ఐఈడీ పేలుడు సంభవించింది. ఇంఫాల్‌లోని తంగల్ బజార్, ఖోయాతోంగ్ జంక్షన్ మధ్య గల ఓ కిరాణా షాప్ ముందు  మంగళవారం ఉదయం ఈ పేలుడు  జరిగింది. ఘటనలో ఐదుగురు పోలీసులతో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 9.20 గంటల సమయంలో ఈ బ్లాస్ట్ జరిగింది.  పేలుడు ధాటికి అక్కడున్న బైక్ లు, మరికొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మిగతా వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఆసుపత్రి  వర్గాలు తెలిపాయి తెలిపింది.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ సీనియర్ రాష్ట్ర పోలీసు అధికారులతో కలిసి పేలుడు స్థలాన్ని సందర్శించారు. ఆ తర్వాత  ఆసుపత్రిలో గాయపడిన వ్యక్తులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..   రద్దీగా ఉన్న ప్రాంతంలో బాంబు పేలడం ఖండించదగినదని, ఈ ఘటనపై ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుందని చెప్పారు.

పేలుడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద ముఠా కూడా.. ఈ పేలుడుకు బాధ్యత వహించలేదు.