మహిళా సంఘాలకు మీసేవ, ఆధార్ కేంద్రాలు

మహిళా సంఘాలకు మీసేవ, ఆధార్ కేంద్రాలు
  • డెయిరీ, పౌల్ట్రీ, క్యాంటీన్ల ఏర్పాటుకూ అవకాశం
  • మహిళా శక్తి పేరుతో కొత్త ప్రోగ్రామ్ పై సర్కార్ కసరత్తు 
  • గైడ్ లైన్స్ ఖరారు చేస్తున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు:  మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం ‘మహిళా శక్తి’ పేరుతో మరో కొత్త ప్రోగ్రామ్​కు శ్రీకారం చుట్టింది. రాష్ర్టంలోని సుమారు 64 లక్షల మంది స్వయం సహాయక బృందాల సభ్యులకు మరిన్ని బాధ్యతలు అప్పగించి వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలని నిర్ణయించింది. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ సౌకర్యం ఉన్నా గత ప్రభత్వంలో పట్టించుకోకపోవడంతో వడ్డీలేని రుణాలు అనుకున్నంత స్థాయిలో ఇవ్వలేదు. బ్రాండింగ్, ప్యాకేజింగ్ వంటి అంశాల్లో అవకాశాలు ఉన్నా ప్రోత్సాహం లేకపోవడంతో మార్కెట్ లో పోటీని తట్టుకొని నిలబడలేకపోయాయి. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలకు చేయూతనివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రంలో దాదాపు 1,050 మీసేవ కేంద్రాలు, ఆధార్ కేంద్రాల అవసరం ఉందని ప్రభుత్వానికి అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. వీటిని మహిళా సంఘాలకు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించినట్టు సమాచారం.

 స్వయం సహాయక సంఘాలలోని మహిళల శక్తి సామర్థ్యాలను వెలికి తీసి వ్యాపారాలు స్థాపించి టార్గెట్లు చేరుకోవడం, ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించే ప్రధాన ఉద్దేశంతో మహిళా శక్తి ప్రోగ్రామ్​ను తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మహిళా సంఘాల సభ్యుల సంఖ్యను వచ్చే ఐదేండ్లలో 63 లక్షల నుంచి కోటి వరకు పెంచాలని ఈ ఏడాది మార్చిలో మహిళా సంఘాలతో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో సీఎం స్పష్టం చేశారు. మహిళలు చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టేలా ఎంకరేజ్ చేసి ఆర్థిక స్వావలంబనకు సహకరించడం, సామాజిక భద్రత కోణంలో సంఘాలను బలోపేతం చేయటమే మహిళ శక్తి ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ కు తగిన  గైడ్ లైన్స్ ను స్త్రీనిధి, సెర్ప్ అధికారులు రెడీ చేస్తున్నారు. త్వరలో మంత్రి సీతక్కకు, సీఎంకు గైడ్ లైన్స్ ను అందజేయనున్నారు. 

మూడు రంగాలు ఎంపిక

మహిళా శక్తి ప్రోగ్రామ్​లో ప్రధానంగా ప్రొడక్షన్, ట్రేడింగ్, సర్వీసెస్ అనే మూడు రంగాల్లో సంఘాలను ప్రోత్సహించాలని సర్కారు భావిస్తోంది. ప్రొడక్షన్ లో భాగంగా పౌల్ట్రీ, పాడి పశువులు, డెయిరీ యూనిట్లు, ఫిషరీస్, చేనేత వస్ర్తాల తయారీ, హస్తకళలు, యూనిఫాంలు కుట్టడం వంటి వాటిని ప్రభుత్వం ప్రొత్సహించనుంది. ఇటీవల సర్కారు విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలు కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించింది. వచ్చే ఏడాది నుంచి మరిన్ని బాధ్యతలు అప్పగించనుంది. ట్రేడింగ్ లో మినీ సోలార్ యూనిట్లు, మినీ సూపర్ మార్కెట్లు, జెనరిక్ మెడికల్ షాపులు, విత్తనాలు ఎరువుల షాపుల వంటివి కూడా ఏర్పాటు చేయించనున్నారు. 

టార్గెట్.. రూ. లక్ష కోట్ల రుణాలు 


మహిళా సంఘాలకు ప్రభుత్వ సహకారంతో వచ్చే ఐందేండ్లలో బ్యాంకులు, స్ర్తీనిధి ద్వారా రూ. లక్ష కోట్ల రుణాలను అందించాలని ప్రభుత్వం టార్గెట్ గా నిర్ణయించింది. చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టేందుకు ఇందులో రూ.25 వేల కోట్లు ఖర్చుచేసేలా ప్లాన్ చేస్తోంది. ఇందులో ఏటా 5 వేల గ్రామ సంఘాలకు రూ. కోటి చొప్పున రూ.5 వేల కోట్ల లోన్లు ఇవ్వనున్నారు. వీటితో పాటు బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు అందజేయనున్నారు. అలాగే మహిళా సంఘాలు తయారు చేస్తున్న వస్తువులకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, బిగ్ బాస్కెట్ లాంటి ఈ– కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంచడం, ట్రేడ్ ఎగ్జిబిషన్లలో పాల్గొనేలా ప్రొత్సహించడం వంటి నిర్ణయాలు అమలు చేయనున్నారు.