- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కరీంనగర్, వెలుగు: జూబ్లీహిల్స్ బైపోల్ తో పాటు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, మార్పును కోరి కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్ టౌన్ లోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో సోమవారం సుడా చైర్మన్కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు.
మాజీ సీఎం కేసీఆర్ రెండేండ్ల పాటు ఫామ్‌హౌస్‌కే పరిమితమై, ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినా, ఇరిగేషన్ పై చర్చ జరిగినప్పుడు ఆయన అసెంబ్లీకి రాలేదని మంత్రి గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లులపై చర్చలు జరిగినా సభకు హాజరు కాలేదన్నారు.
ప్రజలను అవహేళన చేస్తూ మాట్లాడి.. ఇప్పుడు పార్టీ ప్రమాదంలో పడిందని భావించి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారని విమర్శించారు. గత పాలనలో రాష్ట్ర బడ్జెట్‌ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. కేటీఆర్‌కు అహంకారం ఎక్కువని, హరీశ్‌రావు బాధ్యతలేని వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
