- రాష్ట్రంలో 2 లక్షల కనెక్షన్లు, 8 లక్షల సిలిండర్ల సప్లయ్‌పై ఎఫెక్ట్
- హోటళ్లు, పరిశ్రమలకు గ్యాస్ బంద్.. గృహ వినియోగదారులకే ప్రయారిటీ
- నెలకు రూ.150 కోట్ల కమర్షియల్ సేల్స్ పై దెబ్బ
- యుద్ధం కారణంగా దేశంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభం!
హైదరాబాద్, వెలుగు: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దాంతో ఇండస్ట్రీయల్, ఆటోమొబైల్ రంగాలకు సరఫరా ఆగిపోయింది. దీని ప్రభావం రాష్ట్రంలోని 2 లక్షల కమర్షియల్ కనెక్షన్లతో పాటు ప్రైవేట్ కంపెనీల సరఫరాపై కూడా పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకు 8 లక్షల సిలిండర్ల సరఫరా అవుతుండగా..ఈ సప్లయ్ ని ఇప్పుడు కేంద్ర నిర్ణయం నేరుగా దెబ్బ తీయనుంది.
ఒక్క హైదరాబాద్‌లోనే నెలకు 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు విక్రయాలు జరుగుతాయి. టీ స్టాల్‌లు నుంచి స్టార్ హోటళ్ల వరకు నెలకు 4 నుంచి 5.50 లక్షల సిలిండర్లకు అవసరం ఉంటుంది. ఇండస్ట్రీలకు మరో 1.50 లక్షలు అదనంగా డిమాండ్ ఉంది. ఈ మొత్తం కమర్షియల్ సేల్స్ విలువ నెలకు రూ.140 నుంచి రూ.150 కోట్లకు చేరుతుందని గ్యాస్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. రెండు రోజులుగా బల్క్ ట్యాంకర్ల సరఫరా ఆగిపోయింది.
శుక్రవారం నుంచి ఇండస్ట్రీలు, కమర్షియల్ వాడకాలకు సరఫరా పూర్తిగా ఆగిపోయాయి. ‘‘మొదటి రోజు పెద్దగా ప్రభావం కనిపించకపోయినా, మరో రెండు -మూడ్రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కమర్షియల్ సిలిండర్లకు నాలుగైదు రోజుల స్టాక్ మాత్రమే ఉంది’’ అని గ్యాస్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. తాజాగా ఏజెన్సీలు డొమెస్టిక్ డబుల్ సిలిండర్ కనెక్షన్లకు ఒక్కో సిలిండర్ సరఫరాను 30- నుంచి 35 రోజులకు చేయాలని నిర్ణయించారు.
సింగిల్ సిలిండర్ 21 రోజుల వరకు సరఫరా చేయనున్నారు. పరిస్థితి తీవ్రమైతే ఈ గ్యాప్ డబుల్ అవ్వొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దిగుమతులు 30 శాతం పునరుద్ధరిస్తేనే పరిస్థితి కొంత మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర నిర్ణయం తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తాత్కాలికంగా ప్రభావం పడే అవకాశం
గృహ వినియోగదారులకు మాత్రమే ఎల్‌పీజీ..
దిగుమతుల్లో ఏర్పడిన అంతరాయాలతో గృహ వినియోగదారులకు మాత్రమే ఎల్‌పీజీ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఉత్తర్వులిచ్చింది. కమర్షియల్ సిలిండర్లతో పాటు ఇండస్ట్రియల్, ఆటోమొబైల్ రంగాల్లో ఎల్‌పీజీ వాడకంపై తాత్కాలిక పరిమితులు విధించింది. స్కూళ్లు, హాస్టళ్లు, హాస్పిటల్స్ వంటి అత్యవసర సంస్థలకు ఈ నిర్ణయం వర్తిస్తుందా లేదా అనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు.
దేశంలోని అన్ని ఆయిల్ రిఫైనరీలు ఉత్పత్తి చేసే ప్రొపేన్, బ్యూటేన్ వాయువులను పూర్తిగా డొమెస్టిక్ ఎల్‌పీజీ తయారీకే వాడాలని కేంద్రం సూచించింది. సరఫరాను ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు మాత్రమే అందజేయాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి వంట గ్యాస్ అందేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది. తమ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది
గ్యాస్‌ను పొదుపుగా వాడుకోండి
తాజా పరిస్థితుల నేపథ్యంలో గృహ వినియోగదారులు గ్యాస్‌ను పొదుపుగా వాడాలి. ఓటీపీ ద్వారా మాత్రమే సిలిండర్ బుక్ చేసుకోవాలి. అవసరమైతే ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్‌లు వాడండి. రాష్ట్రంలో 67% మంది మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకున్నా రు. మిగిలిన 33% మంది వినియోగదారులు వెంటనే ఏజెన్సీలు, డీలర్లు, డెలివరీ బాయ్స్ వద్ద ఈకేవైసీ చేయించుకోవాలి. నిజమైన వినియోగదారులకు మాత్రమే గ్యాస్ సప్లయ్ జరుగుతుంది. - కె. జగన్‌మోహన్ రెడ్డి , ఎల్‌పీజీ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
