- యూపీఎస్సీ ఫలితాల్లో మనోళ్ల హవా
- 25 మందికిపైగా ఎంపిక
- ప్రభుత్వ ప్రోత్సాహంతో మెరిసిన 20 మంది అభ్యర్థులు
- 55వ ర్యాంకుతో సత్తాచాటిన సింగరేణి బిడ్డ సృజన
- విజేతలకు సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు
హైదరాబాద్, వెలుగు: సివిల్ సర్వీసెస్- 2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి మన రాష్ట్రం నుంచి 25 మందికిపైగా అభ్యర్థులు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం స్కీమ్ మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ పథకం ద్వారా ఆర్థిక చేయూత పొందిన వారిలో ఏకంగా 20 మంది అభ్యర్థులు తుది విజేతలుగా నిలిచి సత్తా చాటారు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన సింగరేణి ఉద్యోగి జి.రాజేశం కుమార్తె సృజన.. ఆలిండియా స్థాయిలో 55వ ర్యాంకు సాధించి రాష్ట్ర స్థాయిలోనే టాపర్‌గా నిలిచింది. తన తండ్రి పనిచేస్తున్న సింగరేణి సంస్థే ఈ స్కీమ్‌కు నిధులు అందించడం, అందులో సృజన విజయం సాధించడం విశేషం. సృజన విజయంపై సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి హర్షం వ్యక్తం చేశారు. సివిల్స్‌కు ప్రిపేరయ్యే పేద అభ్యర్థులకు అండగా ఉండాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చారు. చేయూత స్కీమ్ తో ఈ ఏడాది ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన 202 మందికి లక్ష చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది.
మెయిన్స్ దాటి ఇంటర్వ్యూకి ఎంపికైన 51 మందికి మరో రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకాన్ని అందించారు. వీరిలో 20 మంది తుది ఫలితాల్లో ర్యాంకులు సాధించి దేశసేవకు సిద్ధమయ్యారు. ఇందులో 10 మంది ఓబీసీలు, నలుగురు ఎస్టీలు, ముగ్గురు ఎస్సీలు, ముగ్గురు జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు. కాగా.. సివిల్స్ విజేతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కావడం గర్వకారణమని వారు పేర్కొన్నారు. విజేతలు ప్రజలకు నిబద్ధతతో సేవ చేయాలని వారు ఆకాంక్షించారు.
