ఐసీసీ ర్యాంకింగ్స్‌లో SRH ప్లేయర్ల హవా.. టీ20ల్లో ఇషాన్, టెస్టుల్లో హెడ్ నంబర్-1

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో SRH ప్లేయర్ల హవా.. టీ20ల్లో ఇషాన్, టెస్టుల్లో హెడ్ నంబర్-1

Ishan Kishan: దుబాయ్ వేదికగా ఈరోజు ( జులై 1న, బుధవారం) విడుదల చేసిన ఐసీసీ (ICC) తాజా ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. భారత వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ టీ20ల్లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా అవతరించగా.. ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ తన కెరీర్‌లోనే మొదటిసారి టెస్ట్ క్రికెట్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు.

టి20ల్లో ఇషాన్ కిషన్ టాప్: 
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ దాదాపు ఏడాది కాలంగా టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ, బెల్ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను భారత్ 2–0తో కోల్పోయినప్పటికీ, తాజా అప్‌డేట్ తర్వాత అభిషేక్‌ను వెనక్కి నెట్టి ఇషాన్ కిషన్ నంబర్ 1 సింహాసనాన్ని అధిరోహించాడు. ఈ ఏడాది జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్‌లో ఇషాన్ కిషన్ దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో 317 రన్స్ చేసి పరుగుల వరద పారించాడు. కొలంబోలో పాకిస్తాన్‌పై అతను ఆడిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్నింగ్స్ అతనిని ఈ స్థానానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. 

7 పాయింట్ల ఆధిక్యంలో ఇషాన్: 
ఇషాన్ ప్రస్తుతం తన కెరీర్ బెస్ట్ రేటింగ్‌తో అభిషేక్ శర్మ కంటే కేవలం 7 రేటింగ్ పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సరసన చేరి.. అంతర్జాతీయ టి20ల్లో నంబర్ 1 ర్యాంక్ సాధించిన నాల్గవ బ్యాటర్‌గా ఇషాన్ రికార్డు సృష్టించాడు. ఇక భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే మూడు స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరుకోగా, ఐర్లాండ్ బౌలర్ మాథ్యూ హంఫ్రీస్ కెరీర్ బెస్ట్ రేటింగ్‌తో 25వ స్థానానికి, కెప్టెన్ లార్కాన్ టక్కర్ 77వ స్థానానికి ఎగబాకారు.

ALSO READ : వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై రాజకీయ రచ్చ 

టెస్ట్ క్రికెట్‌లో ట్రావిస్ హెడ్ కింగ్:
టెస్ట్ బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ తన కెరీర్‌లోనే మొదటిసారి ప్రపంచ నంబర్ 1 టెస్ట్ బ్యాటర్‌గా అవతరించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన నాటింగ్‌హామ్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, జో రూట్ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో వారు టాప్ ప్లేస్ కోల్పోయారు. బ్రూక్ రెండో స్థానానికి పడిపోగా, రూట్ మూడో స్థానానికి పడిపోయాడు.

బౌలింగ్ లో బుమ్రా తోపు:  
టీమిండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ఏకఛత్రాధిపత్యం కొనసాధించాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ రెండో స్థానానికి పడిపోవడంతో బుమ్రా ఒంటరిగా నంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టులో ఇంగ్లాండ్‌పై సాధించిన విజయంతో రచిన్ రవీంద్ర (7వ స్థానం), డారిల్ మిచెల్ (11వ స్థానం), డెవాన్ కాన్వే (15వ స్థానం) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మెరుగైన ర్యాంక్ సాధించారు.