విద్యా శాఖలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక

విద్యా శాఖలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక
  • జూన్ 12 వరకు కార్యాచరణ 
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు కొనసాగే ఈ ప్లాన్‌‌కు సంబంధించి విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. స్కూల్ ఎడ్యుకేషన్  నుంచి యూనివర్సిటీల వరకు అన్ని విభాగాల్లో అడ్మిషన్ల పెంపు, విద్యా ప్రమాణాలను పెంచడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, డిజిటల్  గవర్నెన్స్‌‌ను బలోపేతం చేయడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు.

దీనిలో భాగంగా మార్చి 6 నుంచి 15 వరకు 10 రోజుల పాటు విద్యా సంస్థల్లో పారిశుధ్యం, రికార్డుల నిర్వహణ, పెండింగ్  ఫైళ్ల పరిష్కారంపై ప్రత్యేక డ్రైవ్  నిర్వహించనున్నారు. ఈ 99 రోజుల కాలంలో స్కూళ్లు, కాలేజీల్లో అదనపు గదుల మరమ్మతులు, ల్యాబ్స్, లైబ్రరీల ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. పదో తరగతి, ఇంటర్  పరీక్షల నిర్వహణతో పాటు టీచింగ్ స్టాఫ్‌‌కు ఏఐ టూల్స్‌‌పై శిక్షణ ఇవ్వడం, డిజిటల్  రికార్డులను అప్‌‌డేట్  చేయడం వంటి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

వేసవి సెలవుల్లో ప్రొఫెసర్  జయశంకర్  బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పెంచేలా ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. విద్యా శాఖలో ఈ -ఆఫీస్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు మే 11 నుంచి 17 వరకు ఎడ్యుకేషన్  వీక్ నిర్వహించనున్నారు. ఈ ప్లాన్ అమలుకు జిల్లా కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. జిల్లా స్థాయిలో డీఈఓలు, డీఐఈఓలు, వర్సిటీ రిజిస్ట్రార్లను నోడల్  ఆఫీసర్లుగా నియమించారు.