- తలంబ్రాలు పోసుకొని తన్మయత్వంలో మునిగిన శివపార్వతులు, జోగినిలు.
వేములవాడ, వెలుగు : సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి కల్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా సాగింది. స్వామి అమ్మవార్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చిన అర్చకులు ముందుగా ఎదుర్కోళ్లు నిర్వహించారు.
వరుడి తరఫు పెద్దలుగా ప్రతాప రామకృష్ణ, మల్లికార్జున్‌శర్మ, వధువు తరఫు పెద్దలుగా ఈఓ రమాదేవి, ప్రధాన అర్చకులు శరత్ శర్మ, కన్యదాతలుగా ఈశ్వరగారి సురేశ్, నాగలక్ష్మి దంపతులు వ్యవహరించారు. స్వామివారికి వరకట్నంగా రూ. 1000 కోట్లు చెల్లించేందుకు వధువు తరఫు పెద్దలు ఒప్పుకున్నారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కమిషనర్ సంపత్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమైన స్వామి వారి కల్యాణం 12.30 గంటల వరకు కనులపండువగా సాగింది. కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు, శివపార్వతులు, జోగిని సుమారు 80 వేల మంది వరకు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఓ వైపు శివకల్యాణం జరుగుతుండగా.. మరో వైపు శివపార్వతులు, జోగినిలు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ, జీలకర్ర బెట్టం పెట్టుకుంటూ శివున్నే పెండ్లి చేసుకున్నట్లు తన్మయత్వంలో మునిగిపోయారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
