కరెంటోళ్లు.. పైసలిస్తేనే పని చేస్తున్రు... టీజీఈఆర్సీ ఎదుట విద్యుత్‌‌ వినియోగదారుల ఆవేదన

కరెంటోళ్లు.. పైసలిస్తేనే పని చేస్తున్రు... టీజీఈఆర్సీ ఎదుట విద్యుత్‌‌ వినియోగదారుల ఆవేదన
  • పోల్స్‌‌ మార్చడం, ట్రాన్స్‌‌ఫార్మర్ల రిపేర్ల భారం కూడా తమపైనే మోపుతున్నారన్న రైతులు
  • టీజీఎన్పీడీసీఎల్‌‌ పరిధిలో కరెంట్‌‌ ఛార్జీలపై హనుమకొండ కలెక్టరేట్‌‌లో బహిరంగ విచారణ

హనుమకొండ, వెలుగు : ‘కరెంట్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ పనిచేస్తున్న ఉద్యోగులు ప్రతి పనికి పైసలు వసూలు చేస్తున్నరు. ట్రాన్స్‌‌ఫార్మర్లు కాలిపోతే వాటి రిపేర్ల భారం కూడా మా మీదనే మోపుతున్నరు. లైన్ల షిఫ్టింగ్‌‌కు కూడా మమ్మల్నే పైసలు కట్టమని ఇబ్బంది పెడ్తున్నరు’ అంటూ పలువురు రైతులు తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌‌ (టీజీఈఆర్సీ) ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కింది స్థాయి ఉద్యోగుల్లో వసూళ్లు మామూలైపోయాయని వాపోయారు. 

టీజీఎన్‌‌పీడీసీఎల్‌‌ పరిధిలో 2026– -27 ఆర్థిక సంవత్సరానికిగానూ సవరించిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్‌‌ సరఫరా ధరలు, క్రాస్‌‌ సబ్సిడీ సర్‌‌ చార్జీల ప్రతిపాదనలపై ఈఆర్సీ చైర్మన్‌‌ జస్టిస్ డాక్టర్‌‌ దేవరాజు నాగార్జున్‌‌, మెంబర్స్‌‌ చెరుకూరి శ్రీనివాస్‌‌రావు, కంచర్ల రఘు ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌‌ హాల్‌‌లో శుక్రవారం బహిరంగ విచారణ చేపట్టారు. ఈ విచారణకు ఎన్‌‌పీడీసీఎల్‌‌ పరిధిలోని 16 సర్కిళ్ల నుంచి వినియోగదారులు, రైతులు తరలివచ్చారు. ముందుగా టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌‌రెడ్డి కరెంట్ ఛార్జీల ప్రతిపాదనలపై నివేదికను చదివి వినిపించారు. 

అనంతరం పలువురు వినియోగదారులు తమ తమ సమస్యలను ఈఆర్సీ దృష్టికి తీసుకొచ్చారు. 38 మంది వినియోగదారులు లేవనెత్తిన అంశాలకు సీఎండీ వరుణ్‌‌రెడ్డి సమాధానం ఇచ్చారు. తర్వాత తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ జస్టిస్‌‌ దేవరాజు నాగార్జున్ మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మరింత మెరుగైన నాణ్యమైన విద్యుత్ సరఫరా, సేవలు  అందించడానికి కృషి చేయాలని సూచించారు.

పొలాల మధ్య పోల్స్‌‌ తీయాలన్నా పైసలే..

వ్యవసాయంలో యాంత్రీకరణ తప్పనిసరి అయిందని, కానీ చాలాచోట్ల పొలాల మధ్యలో కరెంట్ పోల్స్ ఉండటం వల్ల ట్రాక్టర్లు, హార్వేస్టర్లు, డ్రోన్లు తిప్పుతున్న క్రమంలో సమస్యలు ఏర్పడుతున్నాయని కిసాన్ సంఘ్ నేత ఓరుగంటి శ్రీధర్‌‌రెడ్డి ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. పొలం మధ్యలో ఉన్న పోల్స్‌‌ను గెట్టుపైకి మార్చాలని సిబ్బందిని కలిస్తే పైసలే అడుగుతున్నారని, ప్రతి పనికో రేటు చెప్పి ఫోన్‌‌ పే ద్వారా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇలా అవినీతికి పాల్పడిన ఎనిమిది మంది సిబ్బందిని ఒకే రోజు  సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యుత్‌‌ ప్రమాదాల్లో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు అందించే ఎక్స్‌‌గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని జోగినిపల్లి సంపత్‌‌రావు కోరారు. 

ప్రమాద బాధితుల కోసం ‘విద్యుత్‌‌ బంధు’ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్‌‌టీ, హెచ్‌‌టీ ట్రాన్స్‌‌ఫార్మర్ల రిపేర్లకు వినియోగదారుల నుంచే పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించారు. వివిధ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఎన్పీడీసీఎల్‌‌లో టోల్‌‌ ఫ్రీ సేవలు అందుబాటులో ఉండడం లేదని, లైన్‌‌మన్‌‌ నుంచి ఎస్‌‌ఈ వరకు అందరి నంబర్లు కరెంట్ డిపార్ట్‌‌మెంట్‌‌కు చెందిన ప్రతి ఆఫీస్‌‌లో కనిపించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ప్రతి జిల్లా కేంద్రంలో విద్యుత్‌‌ విజిలెన్స్ ఆఫీఫ్‌‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌‌ చేశారు. 

విద్యుత్ సమస్యల పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ ఒక నెల ముందే షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నా, ఆఫీసర్లు వచ్చే ఒక రోజు ముందు వరకు కూడా వినియోగదారులకు సమాచారం ఉండడం లేదని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. భారత కిసాన్‌‌ సభ్యులు శశిభూషణ్‌‌ కాచే మాట్లాడుతూ.. ప్రభుత్వ బకాయిలు వసూలు చేయాలని కోరారు. మేడారంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎన్పీడీసీఎల్ విశేషంగా కృషి చేసిందని, రాబోయే గోదావరి పుష్కరాల్లో భాగంగా బాసర నుంచి భద్రాచలం వరకు సరైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కరెంట్ చార్జీల్లో మార్పు లేదు : సీఎండీ వరుణ్‌‌రెడ్డి

2026 – 27 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్‌‌ పెంపుదలకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు లేవని టీజీఎన్పీడీసీఎల్‌‌ సీఎండీ కర్నాటి వరుణ్‌‌ రెడ్డి వెల్లడించారు. టైమ్‌‌ ఆఫ్‌‌ డే(టీవోడీ) ధరలలో కూడా మార్పు లేదని చెప్పారు. ఓపెన్ యాక్సెస్ ఎనర్జీ మేరకు సంబంధిత వినియోగదారుల కేటగిరీకి వర్తించే చార్జీలో 10 శాతం స్టాండ్‌‌ బై ఛార్జీల విధింపు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రీన్‌‌ ఎనర్జీని ఎంచుకునే ఎల్టీ, హెచ్‌‌టీ వినియోగదారులకు సాధారణ టారిఫ్‌‌ కంటే యూనిట్‌‌కు రూ.0.66 గ్రీన్‌‌ టారిఫ్‌‌ కూడా కొనసాగుతుందన్నారు. 

విద్యుత్‌‌ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యుత్‌‌కు సంబంధించి ఏ పనైనా డిపార్ట్‌‌మెంట్‌‌ వాళ్లే చేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సిబ్బంది సేవలపై క్షేత్ర స్థాయిలో ఫీడ్‌‌బ్యాక్‌‌ కూడా తీసుకుంటున్నామన్నారు. ఎవరైనా విద్యుత్ సేవలకు సంబంధించిన ఫిర్యాదు చేయాలనుకుంటే ఎన్‌‌పీడీసీఎల్‌‌ పోర్టల్, వాట్సప్‌‌ చాట్‌‌బాట్‌‌, 1912 సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.