బంగ్లాదేశ్లో ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరారు. కార్లు, బైక్లు ఇంధనం కోసం రోడ్డెక్కడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. శుక్రవారం ఢాకా అంతటా చాలా పెట్రోల్ బంకుల దగ్గర ఇదే పరిస్థితి కనిపించింది. సంక్షోభ సమయంలో మాదిరిగానే పెద్ద పెద్ద క్యూలు కనిపించాయి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో బంగ్లాదేశ్ ప్రజల్లో కూడా ఇంధన నిల్వలపై భయం పట్టుకుంది.
#WATCH | Heavy motor vehicle crowd witnessed at the fuel stations in Dhaka amid a reported fuel crisis in the capital city of Bangladesh. pic.twitter.com/IrIWUNd8I7
— ANI (@ANI) March 6, 2026
ఇప్పటికీ సంక్షోభం నుంచి బంగ్లాదేశ్ పూర్తిగా కోలుకోలేదు. ఈ క్రమంలో.. ఆ దేశ ప్రజలు ఇంధన నిల్వలపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొరత ఏర్పడుతుందనే పుకార్ల కారణంగా చాలా మంది అదనపు ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారని, సాధారణ సమయాలతో పోలిస్తే అమ్మకాలు దాదాపు రెట్టింపు అయ్యాయని పెట్రోల్ బంకుల నిర్వాహకులు తెలిపారు. బంగ్లాదేశ్లో ఇంధన ధరలు భారీగా పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఈ భయం కూడా వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టడానికి ప్రధాన కారణం.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం వల్ల గల్ఫ్ ప్రాంతంలోని చమురు, సహజ వాయువు ఎగుమతిదారులు అందరూ మరికొద్ది రోజుల్లోనే ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉందని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
'ఫైనాన్షియల్ టైమ్స్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విషయాలు వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు వల్ల గల్ఫ్ దేశాల నుంచి ఇంధన ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అల్-కాబీ పేర్కొన్నారు.
సప్లై చైన్ తెగిపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 150 డాలర్ల మార్కును దాటే అవకాశం ఉందని.. ఇది ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచి, ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని హెచ్చరించారు. కాబీ హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర శుక్రవారం 4.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 89.17 డాలర్లకు చేరుకుంది.
ఒకవేళ హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతే, రాబోయే రెండు మూడు వారాల్లో చమురు ధర 150 డాలర్ల మార్కును దాటవచ్చని ఆయన అంచనా వేశారు. కాగా, నెలకు 3,000 నౌకలు ప్రయాణించే హార్మూజ్ జలసంధి మార్గంలో యుద్ధం కారణంగా ప్రస్తుతం సుమారు 200 ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
