బూర్గంపహాడ్, వెలుగు: అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటే నష్టాన్ని నివారించవచ్చని కలెక్టర్ జితేశ్వి.పాటిల్ అన్నారు. బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని అంబేద్కర్కాలనీలో సోమవారం విపత్తులను ఎదుర్కొనే అంశంపై ఫైర్ఆఫీసర్క్రాంతికుమార్ఆధ్వర్యంలో, ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ సుఖేందర్ దత్ పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను రక్షించడం, లైఫ్ జాకెట్లు, బోట్లు ఉపయోగించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం, అవసరమైన వైద్య సేవలు, తాగునీరు, భోజనం, తాత్కాలిక నివాసం వంటి సేవలపై అవగాహన కల్పించారు. వివిధ శాఖల అధికారులు తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు, అధికారులు సమన్వయంతో వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.
ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. విపత్తుల సమయంలో అన్ని బృందాలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. భద్రాచలం సబ్కలెక్టర్మృణాల్శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్ సింగ్, ఎన్ డీఆర్ఎఫ్ అధికారి శీనయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు మొక్కలు పెంచాలి
చండ్రుగొండ, వెలుగు: విద్యార్థులు మొక్కలు పెంచాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ సూచించారు. సోమవారం జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులతో బెండాలపాడు శివారులోని కనకగిరి గుట్టలపై ఆయన సందడి చేశారు. ట్రెక్కింగ్ విధానంపై అవగాహన కల్పించారు. ఈ గుట్టలపై కాకతీయుల కాలంలో నిర్మించిన పలు కట్టడాల గురించి వివరించారు. అనంతరం హస్తాల వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. జీపీ సెక్రటరీ రోహిత్, దిశ కమిటీ సభ్యుడు సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
