ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

మధిర, వెలుగు : రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజలను కోరారు. శనివారం మధిర పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. మహిళలను మహాలక్ష్మిలుగా చూడాలనే ఆలోచనతో వడ్డీలేని రుణాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ఏడాదికి రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే.. ప్రతిపక్ష నాయకులు నవ్వారని, కానీ ఇప్పటికే రూ.27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని వెల్లడించారు. పట్టణాల్లోని మహిళా సంఘాలకు మెప్మా ద్వారా శిక్షణ ఇప్పించి పరిశ్రమలు పెట్టించి బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే మొదటి దశలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించామన్నారు. ఇందు కోసం రూ.22,500 కోట్లు కేటాయించామని తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. మరో 50 ఏండ్ల వరకు గుర్తుపెట్టుకునేలా మధిర మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత  తనదేనని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, టీడీపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూరంశెట్టి కిశోర్, మిర్యాల వెంకటరమణగుప్తా, కాంగ్రెస్ అభ్యర్థులు పాల్గొన్నారు. 

మధిర అంటే తనకు ప్రాణం.. 

‘తనకు అనేక అవకాశాలు కల్పించిన మధిర అంటే ప్రాణం, మధిర కీర్తి, ప్రతిష్టలను పెంచేందుకు భవిష్యత్ తరాలకు అద్భుతమైన పట్టణాన్ని అందించడమే తన లక్ష్యం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం సాయంత్రం మధిర మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మధిర పట్టణంలో పుట్టడం తన అదృష్టమన్నారు.

ఇక్కడి ప్రజలు వరుసగా నాలుగు సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించి దీవించి పంపించారని తెలిపారు. మధుర నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. మీరు ఎమ్మెల్యేగా గెలిపించడంతోనే సీఎల్పీ నేతగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.