హైదరాబాద్: కరీంనగర్లో కాంగ్రెస్, ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య ఆట స్టార్ట్ అయ్యిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇండియా పాకిస్తాన్‌ను చిత్తు చేసినట్లుగా కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు బుద్ది చెప్పండని పిలుపునిచ్చారు. ఆదివారం (ఫిబ్రవరి 8) కరీంనగర్లో ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఎంఐఎం రహస్య సమావేశం పెట్టుకుందని.. బీజేపీ 50 సీట్లలో గెలవబోతోందని తెలిసి రూ.100 కోట్లతో ఓట్లను కొనేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. పెద్ద ఎత్తున ఓట్లను కొని గెలవాలని కుట్ర చేస్తున్నయన్నారు. బీజేపీకి ఇల్లు, కుటుంబం ముఖ్యం కాదని.. దేశం, ధర్మమే ముఖ్యమని పేర్కొన్నారు.
కరీంనగర్ ప్రజలారా.. కాంగ్రెస్, ఎంఐఎంలకు ఒక్క సీటు కూడా రానీయకుండా చిత్తు చేయండని కోరారు.
బీజేపీని గెలిపిస్తే కరీంనగర్‌కు రక్షణ కవచంగా మారుతానన్నారు. బీజేపీ ఓడిపోతే కరీంనగర్ సర్వనాశనమయ్యే ప్రమాదముందని అన్నారు. ఒక్కొక్కరు ఒక్కో బస్తీని దత్తత తీసుకుని గంప గుత్త ఓట్లను బీజేపీకి వేయించండని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించి.. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధికి చేసేందుకు సహకరించడని విజ్ఞప్తి చేశారు.
