కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో లోయర్ మానేరు డ్యామ్ ఏనాడూ డెడ్ స్టోరేజీకి చేరలేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరడంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎల్‌ఎండీలో శనివారం వాలీబాల్, ఫుట్ బాల్, హాకీ ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ రెండు దశాబ్దాల చరిత్రలో జూన్ నెలలో ఎల్ఎండీ నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి పడిపోవడం ఇదే మొదటిసారన్నారు.
మేడిగడ్డను రిపేర్ చేయకపోవడం వల్ల ప్రతిరోజు 10 వేల నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోందని, ఆ నీటిని వరద కాల్వ ద్వారా మిడ్ మానేరు, ఎల్ఎండీలను నింపాలన్నారు. కరువు వచ్చినప్పుడు ఆదుకునేదే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎల్ఎండీలో 5 టీఎంసీల నీరు ఉందని, దీనిలో మూడు టీఎంసీలు డెడ్ స్టోరేజీగానే ఉంటుందని, మిగిలిన నీటితో కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందించలేమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
