ప్రయాణికులకు గుడ్ న్యూస్: మెట్రో ఛార్జీల పెంపు నిలిపివేత

ప్రయాణికులకు గుడ్ న్యూస్: మెట్రో ఛార్జీల పెంపు నిలిపివేత

బెంగళూర్: ఛార్జీల పెంపుపై బెంగళూర్ మెట్రో వెనక్కి తగ్గింది. 2026, ఫిబ్రవరి 9 నుంచి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రజా వ్యతిరేకత, రాజకీయ దుమారం చెలరేగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టం చేసింది. 

ఈ మేరకు ఆదివారం (ఫిబ్రవరి 8) ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘2026, ఫిబ్రవరి 9 నుంచి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని నిలిపివేస్తున్నాం. బోర్డు సమీక్ష తర్వాత తుది నిర్ణయం తెలియజేస్తాం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పాత ఛార్జీలే అమలు అవుతాయి’’ అని పేర్కొంది. బెంగళూరు వాసులకు సురక్షితమైన, సరసమైన సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించింది.

కాగా, ఫిబ్రవరి  9 నుంచి టికెట్ రేట్స్ హైక్ చేయాలని బెంగళూర్ మెట్రో నిర్వాహకులు భావించారు. ఈ మేరకు ఛార్జీల పెంపుపై 2026, ఫిబ్రవరి 5న ప్రకటన చేశారు. సవరించిన ధరల ప్రకారం.. 2 కి.మీ వరకు ప్రయాణానికి రూ.10 నుంచి రూ.11, 15 కి.మీ నుంచి 20 కి.మీ మధ్య దూరానికి రూ.70కి బదులుగా రూ.74 పెంచారు. 30 కి.మీ దాటి ప్రయాణాలకు గరిష్ట ఛార్జీ రూ.90 నుంచి రూ.95కి పెంచాలని నిర్ణయించారు. అయితే.. ఛార్జీల పెంపుపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. 

అలాగే.. టికెట్ ధరల పెంపుపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పీడిస్తోందని బీజేపీ విమర్శలు గుప్పించింది. మెట్రో ఛార్జీలను నిర్ణయించడానికి లేదా సవరించడానికి తమకు ఎటువంటి చట్టపరమైన అధికారం లేదని.. మెట్రో రైల్వేస్ (ఆపరేషన్ & నిర్వహణ) చట్టం ప్రకారం ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర ఛార్జీల ప్యానెల్‌పై ఉంటుందని ప్రభుత్వం బీజేపీ కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి టికెట్ ధరల పెంపుపై సర్వత్రా విమర్శలు రావడంతో మెట్రో నిర్వాహకులు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.